కలం, నల్లగొండ బ్యూరో: అది హైదరాబాద్ – విజయవాడ హైవే. సంక్రాంతి (Sankranti) నేపథ్యంలో వాహనాలు బారులుదీరాయి. ఎంతలా అంటే… ఒక గంటసేపు చేయాల్సిన జర్నీకి ఏకంగా 4 గంటల సమయం పడుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో వాహనాలు పుట్ట నుంచి చీమలు బారులుదీరీనట్టు ఏపీ వైపు క్యూ కట్టాయి. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్గేట్ వరకు జాతీయ రహదారిపై దారుణ పరిస్థితి నెలకొంది.
పంతంగి వద్ద 6 కిలోమీటర్లు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి వాహనాలు ఏపీకి క్యూ కట్టాయి. హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో చాలా ప్రాంతాల్లో ఏపీ వాసులు స్థిరపడ్డారు. ఏ ప్రాంతంలో స్థిరపడినప్పటికీ ఏపీకి వెళ్లాలంటే మాత్రం 90 శాతానికి పైగా ఏపీ ప్రజలు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే మహానగరంలోని అన్ని ప్రాంతాలు నుంచి వచ్చిన వాహనాలు.. హయత్ నగర్ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై చేరుకుంటున్నాయి. మహానగరం నుంచి వివిధ రూట్లలో ఔటర్ వరకు చేరుకుంటున్న అక్కడి నుంచి అన్ని వాహనాలు ఒకే హైవేపై వెళ్లాల్సి వస్తుండటంలో పెద్ద ఎత్తున జామ్ అయ్యాయి. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి చిట్యాల వరకు విరామం లేకుండా వాహనాలు కంటిన్యూస్ గా క్షణం ఒక యుగం.. అడుగు ఒక నరకం ఆన్న తరహాలో కదులుతున్నాయి. చౌటుప్పల్ దాటిన తర్వాత పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్కో వాహనం మూవ్ అయ్యేందుకు సగటున నాలుగు నిమిషాల సమయం పడుతుంది. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆరు కిలోమీటర్లకు పైగా వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నాయి. అయితే ఈ టోల్ ప్లాజా వద్ద ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించలేదు.
రోడ్డుపై మరమ్మత్తులతో మరిన్ని తిప్పలు
పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత చిట్యాల వరకు ఫ్లైఓవర్ వంతేన పనులు రెండు మూడు చోట్ల జరుగుతున్నాయి. దీంతో వాహనాల ప్రయాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వెలిమినేడు చిట్యాల టౌన్ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్ల నుంచి ప్రయాణించాల్సి రావడం ఆ సర్వీస్ రోడ్లు కాస్త గుంతల మయంగా మారడంతో వాహనాలు ఈజీగా మూవ్ కావడం లేదు. కొన్ని గ్రామాల్లో సర్వీస్ రోడ్ల నుంచి వాహనాలు అనుమతిస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అయితే చిట్యాల దాటిన తర్వాత నార్కెట్పల్లి మీదుగా అద్దంకి హైవే పైకి వాహనాలు చేరుకోవడం వల్ల కాస్తంత ఉపశమనం లభిస్తుంది. కానీ 90శాతం పైగా వాహనాలు విజయవాడ రూట్లోనే వెళుతుండడం ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రధాన కారణం అవుతుంది.
హైదరాబాద్ – విజయవాడ హైవేపై డేంజర్ జోన్లు
సంక్రాంతికి ఏపీ (Andhra Pradesh)కి వెళ్లే వాహనదారులకు అడుగడుగున ప్రమాదాలే పొంచి ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై డెత్ స్పాట్లు అనేకం ఉన్నాయి ఇక్కడ ఏం మాత్రం అలసత్వ వహించిన క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదాలు లేకపోలేదు. నల్లగొండ జిల్లాలోని ఇనుపాముల జంక్షన్, సూర్యాపేట జంక్షన్, కోదాడ నియోజకవర్గంలో మునగాల, చిలుకూరు తదితర ప్రాంతాల్లో డెత్ స్పాట్లు వాహనాలదారుల నిర్లక్ష్యం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ డెత్ స్పాట్లలో వాహనదారులను అప్రమత్తం చేసేలా పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ శనివారం సాయంత్రం నుంచి మరింతగా వాహనాలు పెరిగే ఛాన్స్ ఉండడంతో ట్రాఫిక్ నిర్వహణ పోలీసులు తలకు మించిన భారంగా మారనుంది.


