రోహిత్, సూర్యల ఫిట్‌నెస్‌పై మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు!

కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఫిట్‌నెస్ చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తమ ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సూచించారు. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని, తన సుదీర్ఘ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఫిట్‌నెస్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మంజ్రేకర్.. విరాట్ కోహ్లీ తన 30వ పడిలో కూడా అన్ని ఫార్మాట్లలో రాణించడానికి ప్రధాన కారణం అతను పాటించే కఠినమైన ఫిట్‌నెస్ అని పేర్కొన్నారు. టి20 క్రికెట్‌లో కోహ్లీ కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని, కానీ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం వల్లే మళ్ళీ పుంజుకున్నారని వివరించారు. కోహ్లీ తన ప్రతి విజయానికి క్రెడిట్ తన శారీరక సామర్థ్యానికే ఇస్తాడని ఆయన గుర్తు చేశారు.

ఇదే క్రమంలో రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్‌ల ఆట తీరుపై మంజ్రేకర్ విశ్లేషించారు. రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై సరైన శ్రద్ధ చూపకపోవడం వల్లే అతని ఆటలో కాస్త తడబాటు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రస్తుతం సూర్యకుమార్ ఎదుర్కొంటున్న ఫామ్ సమస్యలకు కూడా ఫిట్‌నెస్ లేకపోవడమే కారణమని విమర్శించారు. సూర్య వద్ద అనుభవం, టాలెంట్ ఉన్నా.. వాటికి తగ్గట్టుగా అతని శరీరం సహకరించడం లేదని మంజ్రేకర్ అన్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత క్రీడాకారులకు టి20 క్రికెట్ చాలా కష్టంగా మారుతుందని మంజ్రేకర్ హెచ్చరించారు. సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ ఒకప్పుడు టి20 క్రికెట్‌ను ఏలారని, కానీ సూర్య ఇప్పుడు వరుసగా విఫలం కావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ముఖ్యంగా సూర్య ఆడే విలక్షణమైన షాట్లకు కంటి చూపు, వేగం చాలా అవసరమని, అవి తగ్గడానికి ఫిట్‌నెస్ లోపమే కారణమని ఆయన విశ్లేషించారు.

సూర్యకు తాను కోచ్‌గా ఉంటే, అతన్ని మరింత బలంగా, వేగంగా తయారు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తానని మంజ్రేకర్ తెలిపారు. ప్రతిభకు ఫిట్‌నెస్ తోడైతేనే మైదానంలో అద్భుతాలు చేయగలమని ఆయన సందేశం ఇచ్చారు. రానున్న రోజుల్లో సీనియర్ ఆటగాళ్లు తమ శారీరక సామర్థ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకుంటారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>