కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లోని ఓ టీ తోట నుంచి భారత మహిళల రగ్బీలో గుర్తింపు పొందిన క్రీడాకారిణిగా ఎదిగిన సంధ్య రాయ్ (Sandhya Roy) ప్రయాణం ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు మహిళల రగ్బీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న వేళ, చిన్న పట్టణాలు, గ్రామాల అమ్మాయిలకు ఈ టోర్నీ కొత్త ఆశలు కలిగిస్తుందని ఆమె భావిస్తోంది. రగ్బీ ఇండియా ఆధ్వర్యంలో రాహుల్ బోస్ ప్రారంభించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ సెవెన్స్ లీగ్.
2025లో పురుషుల విభాగంతో ప్రారంభమైన ఈ లీగ్, 2026లో మహిళల టోర్నీని కూడా జోడిస్తూ మరో ముందడుగు వేసింది. అయితే భారత రగ్బీ క్రీడాకారుల ఆర్థిక పరిస్థితులపై చాలా మందికి సరైన అవగాహన లేదని సంధ్య చెప్పింది. సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చినా, మంచి ప్రదర్శనలు చేసినా తగిన ఆర్థిక మద్దతు అందడం లేదని ఆమె అభిప్రాయపడింది. గాయాలు కూడా చాలా మంది క్రీడాకారిణుల కెరీర్‌ను ప్రభావితం చేస్తున్నాయని సంధ్య తెలిపింది.
గాయం తర్వాత సరైన చికిత్స, మానసిక అండ లేకపోతే చాలామంది ఆటను వదిలేస్తున్నారని పేర్కొంది. గ్రామాల్లో పరిస్థితి మరింత కష్టంగా ఉంటుందని ఆమె చెప్పింది. తనతో పాటు ఆడిన ప్రతిభావంతులైన పలువురు అమ్మాయిలు కుటుంబ మద్దతు లేక చిన్న వయసులోనే వివాహం చేసుకుని రగ్బీకి దూరమయ్యారని గుర్తు చేసింది. వారిలో కొందరు తనకంటే బాగా ఆడేవారని, వారినే చూసి తాను రగ్బీలోకి వచ్చానని వెల్లడించింది.
తన ప్రయాణంలో కుటుంబం కీలక పాత్ర పోషించిందని సంధ్య తెలిపింది. ఒక దశలో రగ్బీపై ఆసక్తి తగ్గినా, తల్లిదండ్రులు ప్రోత్సహించి ఆటలో కొనసాగించేలా చేశారని చెప్పింది. రగ్బీ కాంటాక్ట్ గేమ్ కావడంతో మొదట భయపడేదానినని, అందుకే ఒకసారి ఆటను వదిలేసినట్లు వెల్లడించింది. అయితే క్లబ్ జట్టుకు ఎంపిక కావడం, విదేశీ పర్యటనకు వెళ్లడం తన ఆలోచన మార్చాయని తెలిపింది. రగ్బీ ద్వారా ప్రపంచాన్ని చూడొచ్చనే విషయం మరింత ఉత్సాహం ఇచ్చిందని చెప్పింది.
భారత అండర్-18 జట్టుకు మాజీ కెప్టెన్‌గా, సీనియర్ జట్టుకు మాజీ వైస్ కెప్టెన్‌గా సేవలందించిన సంధ్య ప్రస్తుతం మహిళల రగ్బీకి ముఖ్యమైన ముఖచిత్రంగా మారింది. ఆసియాలో అగ్రశ్రేణి రగ్బీ క్రీడాకారిణుల జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించింది. అయితే తన విజయాన్ని వ్యక్తిగతంగా చూడనని సంధ్య స్పష్టం చేసింది. సహచర క్రీడాకారిణుల సహకారం లేకపోతే ఈ స్థాయికి చేరుకునే అవకాశం ఉండేదే కాదని పేర్కొంది.
మహిళల రగ్బీ ప్రీమియర్ లీగ్ దేశవ్యాప్తంగా ప్రసారం కానుండటంతో గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఇది ప్రేరణగా మారుతుందని ఆమె ఆశిస్తోంది. తమను చూసి మరింత మంది అమ్మాయిలు రగ్బీ వైపు అడుగులు వేస్తారని నమ్మకం వ్యక్తం చేసింది. తన కెరీర్‌లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తిగా మాజీ భారత కెప్టెన్, ప్రస్తుతం జట్టు ఫిజియోగా ఉన్న వహ్‌బిజ్ భరూచాను సంధ్య గుర్తుచేసుకుంది. ఆమె నాయకత్వం, క్రమశిక్షణ తనకు ఆదర్శంగా నిలిచాయని తెలిపింది.

