కలం, స్పోర్ట్స్: రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) రెండో సీజన్ జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం హైదరాబాద్ హీరోస్ జట్టును గెలిపించేందుకు తమ కెప్టెన్, స్పానిష్ స్టార్ ప్లేయర్ మాన్యుయెల్ మోరెనో (Manuel Moreno) సిద్ధమయ్యారు. గతేడాది జరిగిన తొలి సీజన్‌లో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని హైదరాబాద్, ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోవడంతో చివరకు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 16 నిమిషాల చెడ్డ ఆట వల్ల తమకు బంగారం గెలిచే అవకాశం చేజారిందని అన్నారు.
రగ్బీలో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతాయో ఆ మ్యాచ్ ద్వారా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నామని మోరెనో తెలిపారు. ఈ సారి వేలానికి ముందే కెప్టెన్ మోరెనోతో పాటు కెన్యా ప్లేయర్ కెవిన్ వెకేసాతో పాటు సుమిత్ రాయ్ కుమార్, సంబిత్ ప్రధాన్, వోల్ఫ్రామ్ హాకర్ లాంటి కీలక ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. రగ్బీ ఆటతో పాటు మోరెనో అటు మెడికల్ చదువుకుంటూనే, ఇటు మోడలింగ్ కూడా చేస్తున్నారు. అన్ని పనులను ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
ఈ పద్ధతి రగ్బీ మైదానంలో సమస్యలను సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఎస్‌వీఎన్ఎస్ డ్రీమ్ టీమ్‌లో చోటు సంపాదించిన మోరెనో (Manuel Moreno), వేర్వేరు దేశాల ఆటగాళ్లతో ఆడేటప్పుడు అందరి ఆట శైలిని అర్థం చేసుకుని ఒక నాయకుడిగా జట్టు నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టడమే తన లక్ష్యమన్నారు. గత సీజన్ అనుభవాలు, పాత ఆటగాళ్ల అండతో హైదరాబాద్ హీరోస్ జట్టు ఈసారి మరింత బలంగా కనిపిస్తోంది.

