నోటిఫికేషన్ల ఆలస్యంతో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం..! సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖ

కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో వెలువడకపోవడం, రోజురోజుకూ పెరిగిపోతున్న కుటుంబ ఆర్థిక భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నిరుద్యోగ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ (Mudigonda) మండలంలో తీవ్ర కలకలం రేపింది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు అనే యువకుడు చిన్ననాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఆశయంగా ఎంతో కష్టపడి చదివాడు.

గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తో పాటు ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి సిద్ధమవుతూ పలుమార్లు పరీక్షలు రాశాడు. అయితే ప్రభుత్వ నియామక ప్రక్రియల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర జాప్యం, సరైన సమయంలో ఉద్యోగం దక్కకపోవడంతో వేణు తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడు. దీనికితోడు ఇంట్లో తల్లి అనారోగ్యం, అక్క ఆరోగ్య సమస్యలు, రోజురోజుకూ ముదిరిపోతున్న కుటుంబ ఆర్థిక ఇబ్బందులు అతనిని కోలుకోలేని మానసిక ఒత్తిడికి గురిచేశాయి.

​ఈ క్రమంలో తీవ్ర వేదనకు గురైన వేణు ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక సూసైడ్ నోట్ రాశాడు. తన పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తక్షణమే స్పందించి నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు.

తనలాంటి వేలాది మంది నిరుద్యోగ యువత ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని వేడుకున్నాడు. ​ఈ సంఘటనతో న్యూ లక్ష్మీపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉద్యోగాల కోసం దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులు అనుభవిస్తున్న తీవ్ర మానసిక ఒత్తిడికి, వేదనకు ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>