కలం, కరీంనగర్ బ్యూరో: విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల సిఫ్టింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4 కోట్లను మంజూరు చేసిందన్నారు.
గొల్లపల్లి మండలానికే రూ.2.3 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి అడ్లూరి వెల్లడించారు. గొల్లపల్లి మండల కేంద్రంలో సుమారు రూ.74 లక్షలతో విద్యుత్ తీగల సిఫ్టింగ్ పనులను చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

