కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) శివార్లలో తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఓ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ (Tractor Driver) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తనిఖీలను చూసి భయపడి తప్పించుకునే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ ఎస్ఐ నరేష్ గోపాల్‌పూర్ జాతర వద్ద బందోబస్తు పర్యవేక్షణకు వెళ్లారు. ఈ క్రమంలో గోపాలాపూర్ సమీపంలోని హైవేపై అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న కొన్ని ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేశారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న మరో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్.. పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గున్నాల హరీష్ అనే యువకుడు ఆ ట్రాక్టర్‌ను నడుపుతున్నాడు. పోలీసుల కంటపడకుండా ఉండేందుకు హరీష్ దుర్షేడు గ్రామ శివార్లలోని పంట పొలాల మీదుగా ట్రాక్టర్ లైట్లు పూర్తిగా ఆపేసి వెళ్లసాగాడు. చీకటిలో వేగంగా వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌కు ఒక పెద్ద బండరాయి అడ్డంగా వచ్చింది. దానిని బలంగా ఢీకొట్టడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న హరీష్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన హరీష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.
ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే కేవలం జరిమానా లేదా బైండోవర్ చేయడంతో సరిపోయేదని, కానీ అనవసరమైన భయంతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఘటనపై సమగ్ర విచారణ కోరుతున్నారు. హరీష్‌కు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

