కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీ ముర్గీ చౌక్‌లో శనివారం జరిగిన ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం లాడ్ బజార్ నుండి పురానాపూల్ వరకు అధికారులు విధుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు ఎంఐఎం నేతలు అధికారులను అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించారు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆయనను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.
ఈ ఘటనలో సాహిల్ అక్బర్ (A 1), మాజీ కార్పొరేటర్ గౌస్ (A 2), ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ (A 3)లతో పాటు మరికొందరిని నిందితులుగా గుర్తించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు సాహిల్ అక్బర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజా సేవకులు తమ విధులను నిర్వహిస్తున్నప్పుడు అడ్డుకోవడం లేదా దాడులకు పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

