కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల మీద ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలింది. హరీశ్ రావు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నాదర్‌గూల్ భూముల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119) లో ఉన్న 373 ఎకరాల భూమిలో 7 వేల కోట్ల రూపాయల భారీ స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఉన్నారని.. రక్షకులే భక్షకులుగా మారారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై కోహినూర్ గ్రూప్ సంస్థ తీవ్రంగా ఖండించింది. నాదర్‌గూల్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని సంస్థ వివరణ ఇచ్చింది. ఈ భూ వ్యవహారంతో మంత్రి పొంగులేటికిగానీ, ఆయన కుమారుడు హర్ష రెడ్డికి గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. 2021లోనే స్థలం చుట్టూ రేకులతో ప్రహరి నిర్మాణం జరిగిందని తెలిపింది.
రాజా శివ్ రాజ్ బహదూర్ వారుసులే హక్కుదారులు
‘2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో రాజా శివ్ రాజ్ బహదూర్ వారసులు హక్కుదారులుగా తేలింది. 2015 వరకు భూవివాదం కోర్టులో ఉన్న కారణంగా ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదు. వ్యవసాయానికి అనుకూలం కాని భూమి కావడం, ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదు. కేసు విచారణలో ఉన్న సమయంలో మీడియా ట్రయల్ నిర్వహించడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం’ అంటూ కోహినూర్ గ్రూప్ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండలం నాదర్ గూల్ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమి హక్కులపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలను సంస్థ వివరించింది.
కోహినూర్ సంస్థ ఏం చెబుతోంది?
‘AQ Square Realtors Pvt Ltd సంస్థ 2021లో మొత్తం స్థలాం చుట్టూ రేకులతో ప్రహరిని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్‌లోని టైమ్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రహరి పనులు 2022మే నెలలో పూర్తయ్యాయి. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినవి కావు. AQ స్క్వేర్ రియల్టర్స్ దాని అనుబంధ సంస్థ క్రిస్టల్ మ్యాన్షన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో 06 డిసెంబర్ 2021 నుంచి 01 మార్చి 2023 వరకు పొంగులేటి హర్ష రెడ్డి అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం బోర్డు నుంచి రాజీనామా చేశారు. ఆ వివరాలు MCA రికార్డుల్లో నమోదయ్యాయి.‘ అంటూ కోహినూర్ సంస్థ వివరించింది.
ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం
‘నాదర్‌గూల్ భూ వ్యవహారాన్ని పొంగులేటికి హర్ష రెడ్డి అపాదించడం సరికాదు. ఈ భూమి రాజా శివ్ రాజ్ బహదూర్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తి, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని ధ్రువీకరించబడింది. అసలు ఈ భూమిపై వివాదం 2005లో OS నెంబర్ 155తో ప్రారంభమైంది. యాజమాన్యం ఆక్యుపెన్సీ హక్కులపై డిక్లరేషన్, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. అయితే 30 ఏప్రిల్ 2007న ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీనిపై హైకోర్టులో AS నంబర్ 274/2007 ద్వారా అప్పీల్ దాఖలైంది. డివిజన్ బెంచ్‌లో భిన్నాభిప్రాయాల కారణంగా కేసు మూడో న్యాయమూర్తికి వెళ్లింది. 19 డిసెంబర్ 2011న వెలువడిన తీర్పులో పిటిషనర్లను పూర్తి యజమానులుగా కోర్టు గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా శాశ్వత ఇంజంక్షన్ కూడా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం/APIIC 2013లో దాఖలు చేసిన సివిల్ అప్పీలు (2963, 2964)ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సదరు భూయజమానులకు ఆక్యుపెన్సీ హక్కులు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. భూమి విస్తీర్ణం అధికంగా ఉండటంతో ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు, 2015 వరకు భూమి వివాదంలో ఉండటంతో ఆ చట్టం అమలు కాదు.’ అంటూ కోహినర్ సంస్థ పేర్కొన్నది.
పెండింగ్‌లో కోర్టు కేసు
‘2020 జనవరి 9న ల్యాండ్ రిఫార్మ్స్ ట్రైబ్యునల్ (LRT) నోటీసులు జారీ చేసిందని, దీనిపై భూయజమానులు అప్పీల్ దాఖలు చేయగా అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి “పాట్ ఖరాబ్”గా నమోదైంది. అంటే వ్యవసాయానికి అనుకూలం కాని భూమిగా వర్గీకరించబడింది. నాలా కన్వర్షన్ అనుమతి తిరస్కరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంత వరకుభూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమిగా నమోదైంది. ఈ వివాదం 2005లో ప్రారంభమై, 2015లో ప్రైవేట్ పట్టా భూమిగా తేలింది. సుప్రీంకోర్టు పిటిషనర్ల ఆక్రమణ హక్కులను గుర్తించి, చట్ట ప్రక్రియను అనుసరించకుండా ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. 2016లో దాఖలైన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరించారు. 2021లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ భూమికి సంబంధించిన డెవలప్‌మెంట్ ఒప్పందం AQ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ప్రస్తుతం ఉంది. రాజా శివ్ రాజ్ బహదూర్ వారసుల ప్రతినిధి కరీం అల్లాదీన్‌తో AQ స్క్వేర్ రియల్టర్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా ఒమేగా డెవలప్‌మెంట్ వెంచర్స్, ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్, యునైటెడ్ ల్యాండ్‌మార్క్స్ సంస్థలతో కూడా ఒప్పందాలు ఉన్నాయి.’ అంటూ కోహినూర్ గ్రూప్ వివరణ ఇచ్చింది.

