ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

కలం, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితా సవరణపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలన్నారు. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ పై గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరయ్యారు. మీటింగ్ కి వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీలకు సంబంధించి అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఎన్నికల సమయంలో బూత్ కమిటీలు చేయబోయే పని చాలా కీలకమని సజ్జల సూచించారు. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగిందని.. దాన్ని అన్వయించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఉన్న ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందని చెప్పారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా చూడాలన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా ఉంటారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మారీచుల గురువు అని, టక్కుటమారా విధానాలకు ఆయన పెట్టింది పేరని విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు 40 నుంచి 45 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. సేవామిత్ర యాప్ ద్వారా వివిధ ప్రశ్నలు అడిగి లక్షలాది ఓట్లు తొలగించారని అన్నారు. ఆ సమయంలో వైయస్ జగన్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన విషయాన్ని సజ్జల (Sajjala) తెలిపారు.

వైసీపీ పార్టీ (YSRCP) క్యాడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. బూత్ లెవల్‌లో సమన్వయంతో పనిచేయాలని, బీఎల్ఏలు (Booth Level Agents) ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలని సూచించారు, జోన్‌ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీమ్‌లను సిద్ధం చేసి, ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు.

మైక్రో లెవల్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషన్ బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించే సామర్థ్యం తమకు ఉందన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా, సమర్థవంతంగా పనిచేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ విషయంలో అందరూ సీరియస్‌గా పనిచేయాలని.. ఆషామాషీగా తీసుకోవద్దని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సూచించారు.

Read Also: ‘బాబోయ్.. ఇక్కడ ఉండలేం!’.. అమెరికా వద్దంటున్న భారతీయులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>