కలం, వెబ్ డెస్క్: ఇరాన్ తో చర్చలు ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. సోమవారం నుంచి చర్చలు ప్రారంభం అయ్యాయయని.. హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణుకార్యక్రమం వంటి అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. తాము ఎటువంటి చర్చలకూ అమెరికా ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు తిరిగి వస్తూ మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై భారీ సైనిక దాడిని నిలిపివేసి చర్చలకు అవకాశం కల్పించామని చెప్పారు. హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఒప్పందం కుదిరే దశలో ఉందని పేర్కొన్నారు. అయితే చర్చలు ఎక్కడ జరుగుతాయి, ఎవరు పాల్గొంటారన్న విషయాలను వెల్లడించలేదు.
ఆ రెండు దేశాల మధ్యవర్తిత్వంతో..
ఖతర్, పాకిస్థాన్ వంటి దేశాలు మధ్యవర్తులుగా చర్చలు సాగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్–ఒమాన్ మధ్య హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం కావడంతో, ఈ అంశంపై ఒప్పందం కుదిరితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అణు కార్యక్రమంపై సమగ్ర ఒప్పందం ఇప్పట్లో కష్టమేనని తెలుస్తున్నది. ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విజ్ఞప్తి మేరకే ఇరాన్‌పై ప్రణాళికాబద్ధమైన భారీ దాడిని నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. అయినప్పటికీ అవసరమైతే మళ్లీ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.

