కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ కేసులో భాగంగా సిట్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి మరో ముగ్గురు వ్యక్తులు మాయం చేసినట్లు పేర్కొంది. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానితో పాటు సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్ మృతదేహాన్ని మాయం చేశారని వివరించింది.
ఈ ముగ్గురు నాగరాజుకు అత్యంత సన్నిహితులుగా మెలిగేవారని వివరించింది. సీఐ ప్రైవేట్ వ్యవహారాలన్నీ నాని చూస్తుంటాడని, అశోక్ సీఐకి అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. కొంతకాలం కిందటే నానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పోస్టింగ్ వచ్చిందని స్పష్టం చేసింది. సాయికృష్ణ ఉదంతం బయటపడగానే ముగ్గురు పరారు కాగా, వారి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు.
సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరింపులు..
సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసిన అనంతరం అతడి మేనమామ నవరంగ్‌ను అశోక్, నాని, సురేశ్ కలిసి సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు సిట్ తెలిపింది. అందుకు ఆయన ఒప్పుకోకపోలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారనే విషయమై ఇప్పటివరకు నాగరాజు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

