కలం, వెబ్ డెస్క్ : దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) లో భాగంగా వీరమరణం పొందిన ఆరుగురు జవాన్ల పేర్లను కేంద్రం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సైనికుల పేర్లను చేర్చారు. దేశం కోసం సర్వోన్నత త్యాగం చేసిన వారిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒకరు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఈ అమరవీరుల పేర్లను త్వరలోనే లిఖించనున్నారు.
ఈ ఆపరేషన్‌లో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ దేశ రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారితో పాటు లాన్స్ నాయక్ దినేష్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ కూడా వీరమరణం పొందారు. ఈ జాబితాలో అగ్నివీర్ మురళీ నాయక్ కూడా ఉండటం గమనార్హం. అలాగే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ ఈ ఆపరేషన్‌లో అమరుడయ్యారు. దేశ సరిహద్దుల్లో వీరు చూపిన శౌర్య పరాక్రమాలకు గుర్తుగా, భావితరాలకు వీరి త్యాగాలు తెలిసేలా జాతీయ యుద్ధ స్మారక స్థూపంపై వీరి పేర్లను లిఖించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

