కలం, స్పోర్ట్స్: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఒకవైపు వరుస విజయాలతో దూసుకుపోతుంటే, మరోవైపు ఆ జట్టు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్కు (Azmatullah Omarzai) ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో అంపైర్ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసినందుకు గాను అతనికి ఐసీసీ అధికారిక హెచ్చరికతో పాటు ఒక డెమొరిట్ పాయింట్ విధించింది. ఈ వివాదానికి మూలం ఐర్లాండ్ సిరీస్‌లో జరిగింది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది.
ఆ తర్వాత వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 299 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోని 41వ ఓవర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ అవుట్ అయ్యాడు. అయితే అంపైర్ నిర్ణయంతో ఏకీభవించని అతను, మైదానంలోనే ఎక్కువ సేపు నిలబడి అసహనంతో సైగలు చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 6 వికెట్లతో చెలరేగడంతో ఐర్లాండ్ 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 92 పరుగుల భారీ విజయం సాధించింది.
అంపైర్లు గారెత్ మోరిసన్, రోలీ బ్లాక్, మూడో అంపైర్ జానీ కెన్నెడీ, నాలుగో అంపైర్ జార్జ్ బ్రోలీలు అజ్మతుల్లాపై ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 కింద ఫిర్యాదు చేశారు. మ్యాచ్ రెఫరీ డిన్ కాస్కర్ ప్రతిపాదించిన శిక్షను అజ్మతుల్లా అంగీకరించడంతో విచారణ అవసరం లేకుండానే కేసు ముగిసింది. గత 24 నెలల్లో అతనికి ఇదే తొలి డెమొరిట్ పాయింట్.
మరోవైపు మూడో వన్డేలోనూ రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ చేసిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లడమే కాకుండా, దక్షిణాఫ్రికాలో జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది.

