కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని మీసేవా (MeeSeva) కేంద్రాలు అక్రమ దందాకు అడ్డాగా మారాయి. కేంద్రాల నిర్వాహకులు దళారులతో చేతులు కలిపి అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ సేవలకు అధిక రుసుములు వసూలు చేస్తున్నారు. ఇలా చేసే మీసేవ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే చూసి చూడనట్లుగా ఉంటున్నారు.
నిబంధనలు పాటించకుండా…
మీసేవ కేంద్రాల నిర్వాహకులు వివిధ పనుల కోసం వచ్చే ప్రజల దగ్గర రశీదు మీద ఉన్న ధర కంటే ఎక్కవ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇతర వినియోగదారుల పనులను పక్కన పెట్టి దళారుల పనులను ముందుగా చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్ర, కేంద్ర పథకాలను ఆసరాగా తీసుకొని ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
ప్రతి మీ సేవా కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన సేవల రుసుములు, ఇతర నిబంధనలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. అధిక వసూళ్లను అరికట్టేందుకు రేట్చార్టులు, ఫిర్యాదు వ్యవస్థను అమలు చేయాలని అధికారికంగా కూడా ఆదేశాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని కేంద్రాల్లో రేట్ చార్టులు ప్రదర్శించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఒకే సేవకు ఒక్కో కేంద్రంలో ఒక్కో రేటు వసూలవుతోందని ప్రజలు చెబుతున్నారు. రసీదులు లేకుండా అదనంగా తీసుకునే డబ్బులకు సమాధానాలివ్వడం లేదు. వివరాలు రసీదులో స్పష్టంగా కనిపించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కొన్ని చోట్ల దరఖాస్తు తయారీ, ఫొటో, జిరాక్స్, స్కానింగ్, ప్రింటింగ్, డాక్యుమెంట్ల అప్లోడ్ పేరుతో అదనపు మొత్తాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తులో చిన్న తప్పు జరిగితే సరిదిద్దేందుకు మళ్లీ డబ్బులు అడుగుతున్నారనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి.
దళారులతో మీసేవ నిర్వాహకులు
రవాణాశాఖకు సంబంధించిన స్లాట్లు, లైసెన్స్‌లు, బీమా తదితర పనుల్లో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దళారులతో కుమ్మకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. లేబర్ కార్డు కోసం దరఖాస్తుల నుంచి ఒక్కో కార్డుకు రూ.600పైగా వసూలు చేస్తున్నారు. లేబర్ కార్డుదారుల క్లెయిమ్స్ లోనూ రూ.5వేల నుంచి 10వేల వరకు తీసుకుంటున్నారు. రేషన్‌కార్డు ఉంటే చాలు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి బయోమెట్రిక్ తీసుకొని లేబర్ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులో పేరు, చిరునామా మార్చేందుకు రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. గురకులాల్లో ప్రవేశాలకు కుల, ఆదాయ ద్రువీకరణ పత్రాలు త్వరగా ఇప్పిస్తామంటూ డబ్బులు కాజేస్తున్నారు.
మీ సేవా కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ ఏదీ?
మీసేవా కేంద్రాలపై అధికారుల తనిఖీలు చేయడంలేదు. కలెక్టరేట్‌కు కొంచెం దూరంలోనే ఓ మీసేవ కేంద్రంలో కట్టల కొద్దీ లేబర్ కార్డులను గుర్తించారు. మీసేవ కేంద్రాలు అనుమతులు ఒకరి పేరు ఉండగా నిర్వహించేది మరొకరు. కొన్ని కేంద్రాల్లో అయితే శిక్షణలేని వారిని నియమించుకోవడంతో దరఖాస్తుల్లో తప్పులు ఉంటున్నాయి. యజమానులకు బదులు ఇతరులు నిర్వహిస్తుండంటంతో సేవల ధరల పట్టికను అనుసరించడం లేదు. కనీస వసతులు కరవయ్యాయి. ఆధార్ నమోదు సౌకర్యం ఉన్న మీసేవా కేంద్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతుంది. మీసేవ కేంద్రాల్లో దందాలను అరికట్టి సక్రమంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. “రశీదు మీద ఉన్న ధర కంటే అధిక డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా ఎక్కువ అడిగితే తహసిల్దార్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేయండి. ఆయా కేంద్రాలపై చర్యలు తీసుకుంటాం. టోల్ ఫ్రీ నెంబర్ 1100లోనూ ఫిర్యాదు చేయవచ్చు” అని అధికారులు చెప్పుకొస్తున్నారు.
డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులపై భారం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 500 పైగా మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సుమారు పదివేల పైగా మంది పేద ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కేవలం రూ. 35 కాగా నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి రూ. 150 నుండి రూ. 200 వరకు వసూలు చేశారు. ఫ్యామిలీ కార్డు కోసం ప్రతి నిరుపేద రేషన్ కార్డు లబ్దిదారుడి కుటుంబం ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే. దానికి అదనంగా వసూలు చేస్తున్నారు.
ఓటరు గుర్తింపు కార్డుల్లో ఏకఛత్రాధిపత్యం
ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయడానికి ఒకే ఒక్క మీ సేవ కేంద్రానికి అనుమతి ఉంది. దీనివల్ల నియోజకవర్గ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని సదరు కేంద్ర నిర్వాహకుడు అదనపు మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా మీ సేవ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి కేంద్రంలో ఫీజు బోర్డులు ఏర్పాటు చేయించడంతో పాటు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కేంద్రాల గుర్తింపును రద్దు చేసినప్పుడే ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
మీ సేవలపై నియంత్రణేదీ
”మీసేవల ధరలలో నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం కల్పించిన మీ సేవల పై తగిన చర్యలు, అందుబాటులో ధరలు ఉండాల్సిన అవసరం ఉంది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నా చర్యలేవీ? సామాన్య ప్రజలు బ్రతికేదెలా? నిర్దిష్ట సమయంలో ప్రజలకు సౌకర్యం కలిగించేలా చర్యలు తీసుకోవాలి” కరీంనగర్ లోని కట్టరాంపూర్ కు చెందిన అపర్ణ అంటున్నారు.
పని కావాలంటే పైసలు అదనమే
”మీసేవలో ఏదైనా పని కావాలంటే పైసలు అదనంగా చెల్లించాల్సిందే. రసీదులివ్వరు. తర్వాత రమ్మంటారు. నంబర్ ఇచ్చి పొమ్మంటారు. దళారులు ఎక్కువయ్యారు. తహసీల్దార్ కార్యాలయాల తో పాటు మీ సేవకు అనుసంధానం ఉన్న దలారులంతా ఏకమయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ దందా చేస్తున్నా పట్టించుకునే దిక్కేలేదు” అని గణేష్ నగర్ కు చెందిన పోతుగంటి అంతగిరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదార్ అప్ డేట్ కోసమే వచ్చా.. కానీ!
”నా వయస్సు 30 సంవత్సరాలు. నా అదార్ కార్డు అప్ డేట్ కోసం వచ్చాను. అందులో రెసిడెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. అవన్నీ అయ్యే వరకు తిప్పలు తప్పవు. అన్నీ ఆన్ లైన్ చేసుకోవాల్సిందే. మీ సేవలో ఆలస్యం.. బాదుడు తప్పడం లేదు.. మీ సేవ కేంద్రాలపై నిఘా కచ్చితంగా ఉండాలి” సుబాష్ నగర్ కు చెందిన మహ్మద్ అప్రోజ్ అనే బాధితుడు తెలిపారు.

