ట్రంప్‌తో సీఎం రేవంత్ భేటీ?

కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటనలో పలు ఆసక్తికర సన్నివేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ 6 వరకు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. ఆక్స్ఫర్డ్ సహా పలు యూనివర్సిటీలను సందర్శించనున్నారు. తెలంగాణలోని స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలకు కావాల్సిన టెక్నికల్, అకడమిక్ అవసరాలపై పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకునే వీలుంది. రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించే సీఎం రేవంత్‌రెడ్డి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) తో సమావేశమయ్యే చాన్స్ కనిపిస్తున్నది.

ఇప్పటికింకా అపాయింట్‌మెంట్ ఫిక్స్ కాకపోయినా వారం పది రోజుల్లో ఏదో ఒక సమాచారం వస్తుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అక్కడి ఇండియన్ ఎంబసీలతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. సీఎం ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా అమెరికా రాయబారితో ప్రత్యేకంగా సమావేశమై.. త్వరలో పర్యటించనున్న వివరాలను చర్చించినట్లు సమాచారం.

ఆ మార్గానికి ట్రంప్ పేరు పెట్టడంతో..!

– హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే మార్గానికి ఆ మధ్య ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ నిర్ణయాన్ని తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తన సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని గుర్తించినందున అమెరికా పర్యటన సందర్భంగా సీఎం విజ్ఞప్తికి ట్రంప్ సానుకూలంగా స్పందించి ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అవకాశం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
– ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయం సైతం ట్రంప్, రేవంత్ మధ్య భేటీకి తగిన ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న నమ్మకం కూడా ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
– రెండు వారాల పర్యటనలో యూనివర్సిటీల సందర్శన మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగానే డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది.
– అమెరికాలో పర్యటించే ముఖ్యమంత్రి పూర్తి స్థాయి షెడ్యూల్ తయారైన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో సమావేశమయ్యే ప్రోగ్రామ్‌పై మరింత క్లారిటీ రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>