కలం, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది మార్చిలో ఖాళీకానున్న రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో అన్ని పార్టీలకంటే ముందుగానే కాంగ్రెస్ (Telangana Congress) కసరత్తు ప్రారంభించింది. ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి చెందినవి కాకపోయినా గెలిచి తీరాలని భావిస్తున్నది. అందులో భాగంగా జిల్లాల మంత్రులకు, ఇన్‌చార్జి మంత్రులకు టాస్క్ ఇచ్చి గెలిచే అవకాశమున్న అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాలు కలిపి ఒక స్థానం, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాలకు కలిపి మరో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ రెండు నియోజకవర్గాల్లో పాపులారిటీ ఉన్న, గ్రాడ్యుయేట్లను ఆకర్షించగలిగిన అభ్యర్థులను గుర్తించడంపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో సోషల్ జస్టిస్ ఫార్ములాకు అనుగుణంగా ఒక చోట రెడ్డి, మరో చోట బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నది. మొత్తం ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధితో ముడిపడి ఉన్న ఎన్నిలకు కావడంతో దాదాపుగా ఇది మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఉంటుందన్నది కాంగ్రెస్ భావన. ఈ ఎన్నికల్లో ఫలితాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ముగ్గురి రెడ్డి ఆశావహుల పేర్లు :
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజికవర్గానికి, మరొకటి బీసీకి ఇవ్వాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కాకుండా పది మంది మంత్రులు ఉన్నందున గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా నియోజకవర్గంలో ప్రస్తుతానికి ప్రాథమికంగా వచ్చిన ప్రతిపాదనల ప్రకారం ముగ్గురు అభ్యర్థులు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే.
కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న పటేల్ రమేష్‌రెడ్డి, తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో గుత్తా అమిత్ రెడ్డి ఆసక్తి కనబర్చడంలేదని, తండ్రి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్నందున పదవీ కాలం పూర్తయిన తర్వాత మరోసారి కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాల తరఫున వచ్చిన ముగ్గురి పేర్లూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవే కావడం గమనార్హం. పార్టీ నాయకత్వం ఇందులో ఒకరిని ఎంపిక చేస్తుందా?.. లేక కొత్త పేరును తెరమీదకు తెస్తుందా అనేది త్వరలో తేలనున్నది.
మరో నియోజకవర్గం నుంచి బీసీకి చాన్స్ :
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ముగ్గురి పేర్లు ప్రాథమికంగా పరిశీనలకు వచ్చాయి. ఇందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కాగా మరొకరు బీసీ వర్గానికి చెందినవారు. ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న సామా రామ్మోహన్‌రెడ్డి, గౌరి సతీష్ (యాదవ్), గాలి హర్షవర్ధన్ రెడ్డి. వీరు కాక ఇటీవల వివాస్పద కామెంట్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జక్కిడి శివచరణ్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నది.
ఒక నియోజకవర్గంలో రెడ్డి అభ్యర్థిని ఖరారు చేస్తే మరో చోట బీసీ అభ్యర్థిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్ వాదన. ఆ ప్రకారం ఏ నియోజకవర్గంలో బీసీకి అవకాశం వస్తుందన్నది ఆసక్తికరం. గౌరీ సతీష్ గతంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం సంఘం తరపున యాక్టివ్ రోల్ పోషించారు. విద్యాసంస్థలతో సంబంధాలు ఉన్నందున గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రభావితం చేయగలరన్న వాదన వినిపిస్తున్నది. జక్కిడి శివచరణ్ రెడ్డిపై ఇటీవల పార్టీలోనే ఆరోపణలు వచ్చినా ఎన్ఎస్‌యూఐ నాయకుడిగా విద్యార్థులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగానూ శక్తివంతుడనే అభిప్రాయమున్నది.
కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ పోరు :
ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 14 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉండే అవకాశమున్నది. త్వరలోనే పేర్లు నమోదు చేసుకోడానికి ఈసీ నుంచి నోటిఫికేషన్ వెలువడుతుంది. కాంగ్రెస్‌కు చెందిన 60 మంది ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్‌రెడ్డి పది మంది మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చీఫ్ విప్, మజ్లిస్‌కు చెందినవారితో పాటు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు ఈ జిల్లాకు చెందినవారే కావడంతో గెలుపును నాయకత్వం ప్రతిష్టాత్మంగా తీసున్నది.
అధికారంలో ఉండి కూడా గెలిపించుకోలేకపోతే అప్రతిష్ట అని భావిస్తున్నది. దీంతో మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు కీలకంగా మారింది. రాష్ట్రంలో సగానికిపైగా నియోజకవర్గాలకు చెందిన ఎన్నికలు కావడంతో మినీ అసెంబ్లీ పోరు అని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ ఎన్నికల ఫలితం ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటున్నందున కాంగ్రెస్ అటు నిరుద్యోగ సమస్యను, ఇటు ఫీజు రీఇంబర్స్ మెంట్ ఇష్యూను, జాబ్ నోటిఫికేషన్ల ఆరోపణలను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ పూర్తిస్థాయి దృష్టి పెట్టి గ్రాడ్యుయేట్ల ఓటర్లను ఆకర్షించి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం అగ్నిపరీక్షగా మారింది.

