అక్కడ దోస్తీ.. ఇక్కడ కుస్తీ!

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య పొత్తు పొడుపులు, పొత్తు విడుపులు మొదలయ్యాయి. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ, జనసేన (BJP-Janasena) మధ్య పొత్తు చర్చలు మొదలై చివరికి బెడిసికొట్టాయి. ఈసారి కూడా ఆ రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో, జాతీయ స్థాయిలో బీజేపీ, జనసేన (BJP-Janasena) మధ్య పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం తూర్పు-పడమర తరహాలో వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో పొత్తు కోసం జనసేన ప్రయత్నిస్తున్నా.. బీజేపీ మాత్రం ససేమిరా అంటున్నది. ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వ్యవహరించిన తీరు, ఆ పార్టీ తెలంగాణకు చెందినది కాదు అనే అభిప్రాయమే కారణంగా తెలుస్తున్నది.

జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో నష్టమే తప్ప లాభం లేదన్నది బీజేపీ తెలంగాణ నాయకత్వం భావన. ఇదే విషయాన్ని ఢిల్లీలోని హైకమాండ్‌కు తేల్చిచెప్పింది. దీంతో రెండు పార్టీలూ ఒంటరిగానే పోటీ చేస్తాయా? లేక కలిసిపోతాయా? అన్నది చర్చనీయాంశమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి దీనిపై క్లారిటీ రానుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే.. కుస్తీ పాట్లు తప్పవు. కలిసిపోయి పోటీ చేస్తే.. తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురువుతుందని బీజేపీ శ్రేణులు భయపడుతున్నాయి.

రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది! పొత్తులపై మంటలు రాజుకుంటున్నాయి! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించగా.. పొత్తుల అంశం రాంచందర్ రావు పరిధిలోనిది కాదని, ఆ పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్‌ తేల్చిచెప్పారు. దానికితోడు తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు.

ఇదే క్రమంలో కొందరు బీజేపీ నేతలు జనసేనలో చేరడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో దోస్తీ చేస్తున్న ఈ రెండు పార్టీలు.. తెలంగాణలో మాత్రం కుస్తీకి సై అంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొత్తుకు బీజేపీ తెలంగాణ నాయకత్వం నై అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేంద్రంలో, ఏపీలో పొత్తు ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం అది పనిచేయదని నమ్ముతున్నది.

పవన్ కామెంట్ల ఫలితం!

– బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఆంధ్రప్రదేశ్‌లో కలిసొచ్చినా తెలంగాణలో మాత్రం వర్కౌట్ అయ్యేలా లేదని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. జనసేన ఆంధ్రప్రదేశ్ పార్టీ అనే ముద్రతో పాటు “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అంటూ ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం కలగడానికి కారణమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ లాంటి పార్టీలు సైతం పవన్ కల్యాణ్ కామెంట్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాయి.
– ఇలాంటి పరిస్థితుల్లో జనసేనతో అంటకాగితే నష్టమే తప్ప ప్రయోజనం ఉండదన్నది బీజేపీ తెలంగాణ నేతల భావన. జనసేన తరఫున అదనంగా వచ్చే ఓట్ల సంగతేమోగానీ ఉన్న ఓటు బ్యాంకు కూడా డ్యామేజ్ అవుతుందని కమలం నేతలు లెక్కలేసుకుంటున్నారు.
– బీజేపీ జాతీయ స్థాయి నాయకులకు పొత్తు కుదిర్చే విషయంలో ఆలోచనలు ఎలా ఉన్నా బీజేపీ తెలంగాణ లీడర్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
– పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు తేల్చిచెప్పడంతో.. తెలంగాణ జనసేన నాయకుడు శంకర్ గౌడ్ సైతం ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.

సెటిలర్ ఓటర్ల కోసం సీఎం మాస్టర్ స్ట్రోక్

ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌లో ఉన్నందున హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని సెటిలర్ల ఓట్లను రాబట్టుకోవచ్చనేది జనసేన ఆలోచన. దీనికి తోడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ నుంచి వచ్చే ఇమేజ్‌ కూడా తోడవుతుందనేది మరో ఆలోచన. ఎలాగూ ఏపీలో తెలుగుదేశంతో పొత్తులో ఉన్నందున ఇక్కడ ఆ పార్టీ ఇమేజ్‌ కూడా కలిసొస్తుందన్నది మరో భావన. ఇలాంటిది జరుగుతుందని ముందుగానే గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెటిలర్ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఆవిష్కరించడం, కమ్మ సంఘం ప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తుండడం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించిన తీరు.. ఇవన్నీ జనసేన ఆలోచనలకు ఒకింత బ్రేక్ వేసినట్లయింది. వైఎస్సార్ హయాం మినహా ఆ తర్వాత నుంచి సిటీలోని శివారు ప్రాంతాలన్నీ యాంటీ-కాంగ్రెస్‌గానే ఉన్నాయని, అక్కడి ప్రజలు ఆదరించలేదనే అంశాన్ని అధ్యయనం చేసి సీఎం ఈ తరహా వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.

ఒంటరి పోటీతో చీలనున్న ఓట్ బ్యాంక్

– జనసేనకు తెలంగాణలో తగినంత గ్రౌండ్ లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు గురించి ఆలోచన చేసింది. కానీ అది రివర్స్ అవుతుండటంతో ఒంటరి పోటీకి సై అంటున్నది.
– ఒంటరిగా పోటీ చేయడంతో ఓటు బ్యాంకు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన.. ఇలా పార్టీలవారీగా ఓట్లు చీలిపోనున్నాయి. ఇది ఏ పార్టీకి లాభిస్తుందనేది ఎలా ఉన్నా ఆయా పార్టీలను డ్యామేజ్ చేసేలా వ్యూహాలు అమలు కానున్నాయి.
– తెలంగాణలో బీజేపీ తనను తాను ఒక ప్రత్యేక రాజకీయశక్తిగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నందున తన ఓటు బేస్‌లోకి జనసేన ఎంటర్ కాకుండా చూసుకుంటున్నది.
– జనసేనకు, ఆ పార్టీ చీఫ్ పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణలో అభిమానులున్నా.. హైదరాబాద్‌ సహా, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో కుటుంబ, వ్యాపార, ఉద్యోగ సంబంధాలు ఉన్నా.. అది ఓటు బ్యాంకుగా మారేంతగా పార్టీ నిర్మాణం బలపడలేదు.
– జనసేనతో పొత్తు వర్కౌట్ అయితే తెలంగాణలో బీజేపీకి ఆంధ్ర రాజకీయాల అండ అవసరమైందన్న, సొంత బలం లేకనే ఇలా ఆధారపడుతున్నదన్న అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందన్నది కమలం నేతల ఆందోళన. ఇది రాజకీయ ప్రత్యర్థులకు బలమైన అస్త్రంగా మారే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
– ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుకు దూరంగా ఉండాలని, ఇదే ఫార్ములాను అసెంబ్లీ ఎన్నికలకూ కంటిన్యూ చేయాలని బీజేపీ తెలంగాణ నేతలు తమ వాదన వినిపిస్తున్నారు. అయితే ఇరుపార్టీల మధ్య పొత్తు పొడుపో.. పొత్తు విడుపో.. అనేది జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి తేలనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>