కలం వెబ్ డెస్క్: శబరిమల(Sabarimala) ఆలయ బంగారం చోరీ(Gold Theft )కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో విచారణ చేపడుతున్న సిట్(SIT) శుక్రవారం అయ్యప్ప ఆలయ(Ayyappa Temple) ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరు(Kandararu Rajeevaru)ను అరెస్ట్ చేసింది. ముందుగా ఆయనను అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పోట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు, ఆలయం వెలుపల ద్వారపాలక విగ్రహం, తలుపు ఫ్రేమ్ వద్ద ఉన్న బంగారు పలకల రీ ప్లేటింగ్‌కు ఆయన అనుమతి ఇచ్చారని సిట్ పేర్కొంది. ఈ ప్రక్రియ ఆలయ ఆవరణకు బయట జరగడం ఆచార నిబంధనలకు విరుద్ధమని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
దీనిపై రాజీవరు స్పందిస్తూ తాను కేవలం మరమ్మతులకు మాత్రమే అనుమతి ఇచ్చానని, అన్ని సంప్రదాయ విధానాలను పాటించామని తెలిపారు. అయినప్పటికీ సిట్ ఆయనను 14 రోజుల కస్టడీకి రిమాండ్ చేసింది. సిట్ దర్యాప్తులో ఉన్నికృష్ణన్ పోట్టి తంత్రి సహాయకుడిగా శబరిమల ఆలయానికి వచ్చేవాడని తేలింది. పోట్టికి ఇచ్చిన స్పాన్సర్ అనుమతులు అనుమానాస్పదంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. పోట్టితో జరిగిన అన్ని వ్యవహారాల్లో రాజీవరే ముందుండి వ్యవహరించారని సిట్ అనుమానిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో పోట్టి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే రాజీవరు పాత్రను నిర్ధారించినట్లు సమాచారం.
2019లో ఆలయం వెలుపలే బంగారు పలకల రీప్లేటింగ్ జరిగిందన్న విషయం రాజీవరుకు తెలుసని, అయినప్పటికీ పోట్టితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయలేదని సిట్ ఆరోపిస్తోంది. ఈ బంగారం మాయం కేసుకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. రాజీవరును రెండో కేసులో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 12కు చేరింది. రాజీవరు బెయిల్ పిటిషన్‌పై వచ్చే మంగళవారం విచారణ జరగనుంది.

Read Also : సెన్సార్‌పై స్పష్టత కావాలి.. కళా స్వేచ్ఛను కాపాడాలి: కమల్ హాసన్
Follow Us On: Twitter


