కలం, వెబ్ డెస్క్: ఇటీవల తమిళ హీరో దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీకి సెన్సార్ బోర్డు నుంచి చిక్కులు వచ్చి పడ్డ విషయం తెలిసిందే. చివరకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డుపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ (RGV) సంచలన కామెంట్లు చేశారు. సెన్సార్ బోర్డుకు కాలం చెల్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘12 ఏళ్ల పిల్లాడు మొబైల్ ఫోన్‌తో గోప్రోలో చిత్రీకరించిన ఉగ్రవాదుల హత్య వీడియోలను చూడగలడు. 9 ఏళ్ల పిల్లాడు పొరపాటున హార్డ్‌కోర్ పోర్న్‌ను చూసే అవకాశమూ ఉంది. ఒక రిటైర్డ్ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ నుంచైనా తీవ్రవాద ప్రచారాన్ని, కుట్ర సిద్ధాంతాలను గంటల తరబడి చూడగలడు. వీటికి ఎటువంటి సెన్సార్ లేదు.’ ఇటువంటి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అవసరం ఉందా?‘ అంటూ ఆర్జీవీ (RGV) వ్యాఖ్యానించారు.
‘న్యూస్ ఛానెల్స్ నుంచి యూట్యూబ్ వరకు, కొన్ని ఓటీటీల్లో ఎవరో ఒకరిని దూషిస్తూ వీడియోలు వస్తున్నాయి. సినిమా శక్తివంతమైన మాధ్యమం అని మీరు అంటుంటే… సోషల్ మీడియా సినిమాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుందని ఒప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో, ఒక సినిమాలో ఒక పదాన్ని కట్ చేయడం, ఒక షాట్‌ను ట్రిమ్ చేయడం, ఒక సిగరెట్‌ను బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని కాపాడుతున్నామని సెన్సార్ బోర్డు భావించడం ఒక జోక్‌లాంటిదే.‘ అంటూ ఆర్జీవీ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.
‘సెన్సార్ బోర్డు పుట్టింది ఒక కొరత ఉన్న కాలంలో. అప్పుడు దృశ్యాలు అరుదు, సమాచారం పరిమితం, మీడియా మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. ఆ రోజుల్లో నియంత్రణకు అర్థం ఉండేది. కానీ ప్రస్తుతం నియంత్రణ అసాధ్యం. ఎవరు ఏం చూడాలి? ఏమి చూడకూడదో నిర్ణయించే అధికారం ఇక ఎవరికీ లేదు. ఇలాంటి కాలంలో సెన్సార్ అనేది ప్రజలను రక్షించదు. వీక్షకులను అవమానిస్తుంది. ఎవరు పాలించాలి అన్నది నిర్ణయించే తెలివి మనకు ఉందంటాం. కానీ ఏమి చూడాలి, ఏమి వినాలి అన్నది నిర్ణయించుకునే తెలివి మనకు లేదంటామా?’ అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు.
Read Also : సెన్సార్‌పై స్పష్టత కావాలి.. కళా స్వేచ్ఛను కాపాడాలి: కమల్ హాసన్
Follow Us On : Twitter


