కలం, వెబ్ డెస్క్ : భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) జనవరి 4 నుంచి 10 వరకు ఫ్రాన్స్, లక్సెంబర్గ్ దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పారిస్ పర్యటనలో భాగంగా డాక్టర్ జైశంకర్ ఫ్రాన్స్ దేశ అగ్రనేతలతో సమావేశమవుతారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారోట్‌తో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా భారత్ – ఫ్రాన్స్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇప్పటివరకు జరిగిన పురోగతిని వారు సమీక్షిస్తారు. అలాగే అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకోనున్నారు. ముఖ్యంగా 31వ ఫ్రెంచ్ రాయబారుల సదస్సులో డాక్టర్ జైశంకర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న అనంతరం జైశంకర్ (Jaishankar) లక్సెంబర్గ్ దేశాన్ని సందర్శిస్తారు. అక్కడ ఆ దేశ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి జేవియర్ బెటెల్‌తో పాటు ఇతర సీనియర్ నాయకత్వంతో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి. తన పర్యటనలో భాగంగా లక్సెంబర్గ్‌లో నివసిస్తున్న భారతీయులతో కూడా ఆయన ముఖాముఖి నిర్వహించి, వారితో సంభాషించనున్నారు. ఈ పర్యటన యూరప్ దేశాలతో భారత దౌత్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.


