కలం, వెబ్ డెస్క్ : 2036 ఒలింపిక్స్ (Olympics) నిర్వహణకు భారత్ సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రకటించారు. ఆదివారం వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీలను మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. గత పదేళ్లలో ఫిఫా అండర్ –17, హాకీ ప్రపంచ కప్, చెస్ టోర్నమెంట్ వంటి 20కి పైగా అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు.
2030 లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games), 2036 ఒలింపిక్స్ (Olympics) నిర్వహణకు కూడా భారత్ పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్నదని ప్రధాని మోడీ చెప్పారు. గెలుపు ఏదైనా ఒక్కరి వల్ల సాధ్యం కాదనే విషయాన్ని వాలీబాల్ ఆట తెలియజేస్తుందని అన్నారు. సమన్వయం, విశ్వాసం, జట్ల సంసిద్ధతపైనే విజయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇందులో అందరి పాత్ర, బాధ్యత ఉంటుందని వాటిని నెరవేర్చినప్పుడే విజయం సాధిస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు.


