కలం, వెబ్‌డెస్క్: చెన్నై కోటలో తమకు ఎదురులేదని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిరూపించుకుంది. ముంబై ఇండియన్స్ (MI)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతవిజయం అందుకుంది. ముంబై బ్యాటర్లను కట్టడి చేయడంలోనే కాకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా చెన్నై ప్లేయర్లు సక్సెస్ అయ్యారు. ముంబై ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్న ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన ఆటతీరుతో జట్టును దగ్గరుండి గెలిపించాడు. దీంతో ముంబైపై చెన్నై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై బ్యాటర్లు మరో 11 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ విల్ జాక్స్ (1) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ, ర్యాన్ రికెల్టన్ (37) ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వన్ డౌన్‌లో వచ్చిన నమన్ ధిర్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన నమన్, ముంబైకి పోరాడే స్కోరు అందించాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ (21) మెరుపులు మెరిపించినా, తిలక్ వర్మ (5), హార్డిక్ పాండ్యా (18) విఫలం కావడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు. నూర్ అహ్మద్ కూడా 2 వికెట్లతో రాణించాడు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్ సంజూ శామ్సన్ (11) నిరాశపరిచినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. 48 బంతుల్లో 67 పరుగులతో అజేయంగా నిలిచిన గైక్వాడ్, ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనికి తోడుగా కార్తీక్ శర్మ (54 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యం ఫలితంగా చెన్నై కేవలం 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసినా, ఇతర బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ 3.1 ఓవర్లలోనే 37 పరుగులు ఇచ్చుకోవడం ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది.

