కలం, వెబ్ డెస్క్ : నగరంలోని మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒక ట్యాక్సీ డ్రైవర్ రాక్షసంగా ప్రవర్తించిన తీరు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గాయత్రీ నగర్ నుండి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తున్న ఎస్.కె. జిలానీ, ఆయన కుమారుడు ఫైసల్‌ను వెనుక నుండి ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై నిలదీయగా డ్రైవర్ గొడవకు దిగడమే కాకుండా అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు.
నిందితుడిని అడ్డుకునేందుకు జిలానీ కారుకు ఎదురుగా వెళ్లగా సదరు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఆయనపైకే పోనిచ్చాడు. ప్రాణభయంతో జిలానీ కారు బోనెట్‌ను గట్టిగా పట్టుకోగా అదే స్థితిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర అతడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. బాధితుడు నొప్పితో అరుస్తున్నా డ్రైవర్ వాహనం వేగాన్ని తగ్గించలేదు. బాలాపూర్ క్రాస్‌రోడ్స్ మీదుగా మండమల్లమ్మ జంక్షన్ వరకు అలాగే వెళ్లాడు. గమనించిన తోటి వాహనదారులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. చివరకు జనం చుట్టుముట్టడంతో నిందితుడు కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో ఫైసల్ రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలపాలవడంతో ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Also: పుచ్చకాయల సరఫరాలపై తనిఖీ.. FSSAI కీలక ఆదేశాలు
Follow Us On: WhatsApp

