కలం, జనగామ: జనగామ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో గ్రామాలు, పట్టణాల్లో ప్రతి వార్డు స్థాయిలో క్రీడా ప్రాంగణాల(Rural Sports Grounds)ను అట్టహాసంగా ఏర్పాటు చేసింది. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రారంభదశలో ప్రశంసలు అందుకున్నప్పటికీ, ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఈ ప్రాంగణాలు నిరుపయోగంగా మారి బోర్డులకే పరిమితమవుతున్నాయి. నర్మెట్ట, రఘునాథ్‌పల్లి, తరిగొప్పుల, కొడకండ్ల, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాలతోపాటు జనగామ మండలం, జనగామ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాలకు దూరంగా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం, సరైన క్రీడా సామగ్రి అందించకపోవడం, నిర్వహణలోపం వంటి కారణాలతో యువతను ఆకర్షించలేకపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినప్పటికీ, పర్యవేక్షణ లేక అవి ఖాళీ ప్రదేశాలుగా మారిపోయాయి. ముఖ్యంగా కొడకండ్ల మండలంలో పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. మండలంలోని 21 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, వాస్తవానికి కొన్ని చోట్ల కేవలం బోర్డులు మాత్రమే కనిపిస్తున్నాయి. మండల కేంద్రంలో క్రీడాప్రాంగణం పేరుతో పొలాల మధ్య బోర్డు ఏర్పాటు చేయగా, అక్కడ అసలు మైదానం మాత్రం లేదు.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి..
ప్రైవేటు వ్యక్తులు ఆ భూమి తమదని చెబుతూ వరి పంట సాగు చేస్తున్నారు. దీంతో క్రీడా ప్రాంగణం అనే పేరుతో కేవలం బోర్డు మాత్రమే ఉండటం యువతలో ఆగ్రహానికి దారితీసింది. ఇంకా అనేక గ్రామాల్లో క్రీడాశాఖ నుంచి వచ్చిన సామాగ్రి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే మగ్గిపోతుందని, వాటిని వినియోగించే పరిస్థితి లేదని ఔత్సాహిక క్రీడాకారులు వాపోతున్నారు. మైదానాలు లేక, పరికరాలు అందుబాటులో లేక యువత తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు కోల్పోతున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి అంతే దయనీయంగా ఉంది. సరైన నిర్వహణ లేకపోవడంతో కొన్ని ప్రాంగణాలు చెత్తకుప్పలుగా మారిపోతున్నాయి. వాలీబాల్, క్రికెట్, కబడ్డీ వంటి క్రీడలకు అవసరమైన పరికరాలు లేకపోవడం, రాత్రివేళల్లో వినియోగానికి లైటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతమైన జనగామ మున్సిపాలిటీలో కూడా స్థలం కొరత, వసతుల లేమి కారణంగా క్రీడా ప్రాంగణాల వినియోగం తగ్గిపోయింది.
పర్యవేక్షణ లేక ఇబ్బంది
యువతను క్రీడల వైపు మళ్లించేలా శిక్షణా కార్యక్రమాలు, పోటీలు నిర్వహించకపోవడం కూడా ప్రధాన కారణంగా మారింది. క్రీడా ప్రాంగణాలు కేవలం నిర్మాణాలుగా కాకుండా, గ్రామీణ యువత ప్రతిభను వెలికితీయగల వేదికలుగా మారాల్సి ఉన్నప్పటికీ, సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లోపంతో ఈ పథకం లక్ష్యానికి దూరమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఇప్పటికే ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పునరుద్ధరించి, అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సామాగ్రి అందించి, యువతను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే “క్రీడల అభివృద్ధి” పేరుతో నిర్మించిన ఈ ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

