కలం, వెబ్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ తన ప్రతాపం చూపిస్తోంది. ఐపీఎల్ 2026లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, సాల్ట్ కేవలం పరుగులే కాదు రికార్డ్‌ల వేట కూడా చేశారు. వారిద్దరే కాదు రోహిత్ శర్మ కూడా ఉన్న కాసేపట్లో తన మార్క్ ఆట ఆడాడు. దీంతో ఆర్‌సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ పలు వ్యక్తిగత మైలురాళ్లకు వేదికైంది.
విరాట్ కోహ్లీ: టీ20ల్లో 100 పరుగుల భాగస్వామ్యాల్లో 47 సార్లు భాగస్వామిగా ఉండి రికార్డు సృష్టించారు. అలాగే ముంబైపై 1000 పరుగులు దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచారు.
రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు.
ఫిలిప్ సాల్ట్: తన టీ20 కెరీర్‌లో 350 సిక్సర్ల మార్కును చేరుకున్నారు.
జితేష్ శర్మ: ఐపీఎల్ కెరీర్‌లో 1,000 పరుగుల మైలురాయిని దాటారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. రాబోయే మ్యాచ్‌లలో జట్లు తమ ప్రదర్శనను ఎలా మెరుగుపరుచుకుంటాయో చూడాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్‌సీబీ ఆరంభం నుంచే విజృంభించడం ప్రారంభించింది. టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 11 ఓవర్లలోనే వీరిద్దరూ 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాల్ట్ 36 బంతుల్లోనే 78 పరుగులు చేయగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 265 స్ట్రైక్ రేట్‌తో మెరుపు వేగంతో 53 పరుగులు జోడించారు. దీంతో ఆర్సీబీ భారీ స్కోరును సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆది నుంచీ అవసరమైన రన్ రేట్‌ను అందుకోవడంలో తడబడింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 31 బంతుల్లో 9 సిక్సర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ముంబై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ముంబై వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.

