ఆర్టీవో వేదికగా ‘రేడియం’ దోపిడీ.. ఉమ్మడి కరీంనగర్‌లో సిండికేట్ దందా

కలం, కరీంనగర్ బ్యూరో: రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణా శాఖ ప్రవేశపెట్టిన ‘రిఫ్లెక్టివ్ టేపులు, క్యూఆర్ కోడ్’ నిబంధన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వాణిజ్య వాహనదారుల పాలిట శాపంగా మారింది. ప్రయాణికుల, వాహనాల భద్రత పేరిట ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు దళారులు, కొన్ని ఎంపిక చేసిన ఏజెన్సీలకు కాసుల వర్షం కురిపించే వ్యాపారంగా రూపాంతరం చెందింది. నిబంధనల పేరుతో నిలువునా దోపిడీ (RTO Radium Scam) చేస్తున్నా పట్టించుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు ‘మాకేం సంబంధం లేదు’ అన్నట్లు వ్యవహరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిలువునా దోపిడీ

కరీంనగర్‌కు చెందిన నాగులు తన ఆటో ఫిట్‌నెస్ రెన్యూవల్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లారు. గతంలో రూ. 300 నుండి రూ. 500 లోపు పూర్తయ్యే రేడియం టేపుల ప్రక్రియకు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉన్న కొత్త టేపులు వేయాలంటూ ఏజెన్సీ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన అసలు ధర కంటే నాలుగుంతలు పెంచి ఏకంగా రూ. 1,200 వసూలు చేశారు.

జగిత్యాలకు చెందిన సురేష్ తన ప్రైవేటు బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (FC) కోసం వెళ్లగా, వాహనం కొనుగోలు చేసినప్పుడు కంపెనీ వేసిన టేపులు చెల్లవని ఏజెన్సీ వారు తిరస్కరించారు. ఆ టేపులకు రెండేళ్ల కంపెనీ వారంటీ ఉన్నప్పటికీ.. మళ్లీ కొత్త క్యూఆర్ టేపులు వేయించుకోవాలని భయపెట్టి రూ. 6,000 వసూలు చేశారు.

సిండికేట్ అవతారం.. వారంటీ ఉన్నా బాదుడే..

కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం లారీలు, ఆటోలు, బస్సులు, గూడ్స్ వాహనాలకు క్యూఆర్ కోడ్, రవాణా శాఖ లోగో, సీరియల్ నంబర్ ఉన్న నాణ్యమైన రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి. అయితే, ఉమ్మడి జిల్లాలోని ఆర్టీవో కార్యాలయాల వద్ద ఉన్న ఏజెన్సీలు విడివిడిగా పోటీ పడకుండా ఒకే ధరకు విక్రయించేలా కుమ్మక్కయ్యాయి. కంపెనీ తయారీ సమయంలోనే రెండేళ్ల వారంటీతో కూడిన టేపులను అతికించినప్పటికీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం వచ్చినప్పుడు “పాతవి చెల్లవు” అని సాకు చూపి బలవంతంగా కొత్తవి వేస్తున్నారు. అందరూ ఒకే సిండికేట్ ధరలు చెబుతుండటంతో వాహనదారులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోతోంది.

ఒక ఆటో రిక్షాకు ముందు, వెనుక భాగాలకు కలిపి తెలుపు, ఎరుపు రంగుల రిఫ్లెక్టివ్ టేపులు ఒక మీటరు చొప్పున రెండు మీటర్లు అవసరం. రెండు పక్కల పసుపు రంగు టేపులు సుమారు రెండు మీటర్లు అవుతుంది. మొత్తంగా ఒక ఆటోకు సుమారు నాలుగు మీటర్ల పొడవు కలిగిన టేప్ ఐదు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఆటోకు అయ్యే మొత్తం రూ. 600 లోపే ఉంటుంది.కానీ ఏజెన్సీల క్యూఆర్ అప్‌లోడ్, ఏజెన్సీ ఛార్జీల పేరిట ఆటో డ్రైవర్ల నుంచి రూ. 1,400 వరకు వసూలు చేస్తున్నారు.

ఆ ఐదు సంస్థలే.. నియంత్రణ కరవు

కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం లారీలు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాలకు నాణ్యమైన రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి. ఆయా టేపులపై క్యూఆర్ కోడ్, రవాణా శాఖ లోగో, సీరియల్ నంబర్ ఉండాలని, రవాణా శాఖ ఎంపిక చేసిన ఆరు గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేయాలని నిబంధన విధించారు.

అధికారిక లెక్కలు వర్సెస్ ఏజెన్సీల దోపిడీ

మొత్తంగా ఒక ఆటోకు సుమారు నాలుగు మీటర్ల పొడవు కలిగిన టేప్ ఐదు ఖర్చవుతుంది. పన్నులు, క్యూఆర్ సర్వీస్‌తో కలిపి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఆటోకు అయ్యే ఖర్చు గరిష్టంగా రూ. 600 లోపే. కానీ ఆర్టీవో ఆవరణలోని ఏజెన్సీలు క్యూఆర్ అప్‌లోడ్, సేవా రుసుముల పేరుతో ఆటో డ్రైవర్ల నుంచి రూ. 1,400 వరకు గుంజుతున్నారు. కాగా ఒక్కో ఆటోపై 133% అదనంగా (రూ. 800) అక్రమంగా దండుకుంటున్నారు. జిల్లాలో ఉన్న 1.18 లక్షలకు పైగా వాణిజ్య వాహనాల ఆధారంగా ప్రతి ఏటా కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఏజెన్సీలు, దళారుల జేబుల్లోకి వెళ్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వాణిజ్య వాహనాల వివరాలు:

జిల్లా వాణిజ్య వాహనాల సంఖ్య:
కరీంనగర్             4 9,348
పెద్దపల్లి              27,471
జగిత్యాల             23,474
రాజన్న సిరిసిల్ల     18,546
మొత్తం             1,18,839

‘మామూళ్ల’ హస్తం?

ఏజెన్సీలు వాహనదారుల నుండి రెట్టింపు మొత్తాలు వసూలు చేస్తున్నా, రవాణా శాఖ అధికారులు మాత్రం “రేడియం టేపుల ధరల నియంత్రణ మా పరిధిలో లేదు” అని బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తున్నారు. ఆర్టీవో కార్యాలయ ప్రాంగణంలోనే ఈ దోపిడీ జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ‘మామూళ్ల’ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిష్కారం చూడాలి..

ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా టేపుల అసలు ధరలను పారదర్శకంగా చెల్లించేలా క్యూఆర్ సిస్టమ్‌ను రవాణా శాఖ వెబ్‌సైట్‌కు అనుసంధానించాలి. ప్రతీ ఆర్టీవో ఆఫీసు వద్ద ప్రభుత్వ అధికారిక ధరల పట్టికను ప్రదర్శించాలి. దళారులు, ఏజెన్సీలపై విజిలెన్స్ దాడులు నిర్వహించాలి. వాహన తయారీ సంస్థలు వేసిన టేపులకు వారంటీ ఉన్నంత కాలం మళ్లీ క్రొత్తవి వేసుకోవాలని నిర్బంధించకుండా మినహాయింపు ఇవ్వాలంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>