కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాష్ట్ర పాలనలో తీవ్రంగా విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం డైవర్షన్ పాలిటిక్స్‌కు (Diversion Politics) పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్వేషం, విధ్వంసకర విధానాలే కాంగ్రెస్ మార్క్ పాలనగా మారాయని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని పువ్వాడ పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరు, ఎన్నికల హామీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు రోజుకో కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారని అన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలను ఎక్కువ కాలం తప్పుదోవ పట్టించలేరని పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా బీఆర్‌ఎస్ వెనక్కి తగ్గదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

