కలం, నల్లగొండ: నర్సంపేట ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదం నింపింది. శంకర్ గౌడ్ మృతికి నివాళులర్పిస్తూ నల్లగొండ డిపో కార్మికులు శుక్రవారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. నల్లగొండ బస్టాండ్ ఆవరణ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు కొనసాగింది. వందలాది మంది కార్మికులు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని, కన్నీటి పర్యంతమవుతూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘శంకర్ గౌడ్ అమర్ రహే’ అంటూ చేసిన నినాదాలతో బస్టాండ్ పరిసరాలు మార్మోగాయి.
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కేవలం విధుల్లో ఉన్న కార్మికులే కాకుండా, మహిళా ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నల్లగొండ (Nalgonda) పట్టణంలో ఈ సందర్భంగా కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయినప్పటికీ, కార్మికుల ఆవేదనను చూసి స్థానికులు సైతం మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. కార్మికులపై ఒత్తిడి తగ్గించి, వారి సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే చర్చలకు రావాలని కోరారు. ఇలాంటి బలవన్మరణాలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ర్యాలీ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్ పరిసరాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. నల్లగొండ పట్టణం మొత్తం కొవ్వొత్తుల వెలుగులో కార్మికుల కన్నీటి నివాళులతో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
Read Also: ORR-RRR మధ్య ఇండస్ట్రియల్ పార్కులు: మంత్రులు
Follow Us On: Sharechat

