కరువును ముందే పసిగట్టారు.. నీటిని ఒడిసిపట్టారు!

క‌లం, మెద‌క్ బ్యూరో: కరువు వస్తుందేమోనని ఎదురుచూడలేదు.. ప్రభుత్వాల సహాయం కోసం ఆగలేదు.. ప్రజలే ముందడుగు వేశారు. నీటి కోసం ఆకాశం వైపు చూడకుండా, తమ భవిష్యత్తు కోసం ప్రతి వర్షాపు బొట్టు ఒడిసిపట్టేలా రంగంలోకి దిగారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ కుంటలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ (Water Conservation) చేసుకున్నారు. కరువు పరిస్థితులను ముందే పసిగట్టి, సంగారెడ్డి జిల్లాలోని ఓ మూడు గ్రామాలు చేపట్టిన జల సంరక్షణ ప్రయత్నం ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ (Narayankhed) నియోజకవర్గ ప్రాంతం అంటేనే కరువు ఛాయలు, వలసలు..! మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులేవీ లేకపోవడంతో తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం.. ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇక్కడ వ్యవసాయం పూర్తిగా వర్షాధారంగానే సాగుతున్నది. ఇటీవల వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడంతో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు మరింత పెరిగాయి. బోర్లలో నీరు తగ్గిపోవడం, తాగునీటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది.

అందరినీ ఒకతాటిపైకి తెచ్చి..

ఈ పరిస్థితిని ముందే గుర్తించిన ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్.. తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. మొన్నటి వేసవి సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన.. గ్రామాల పరిస్థితులను, ప్రజల ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. రాబోయే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలను అన్వేషించారు. అందులో భాగంగా నారాయణ్‌ఖేడ్ మండలం పీర్లా తండా, మనూరు మండలం ముక్తాపూర్, నాగల్గిద్ద మండలం పుసాల్పాడ్ గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో జల వనరుల సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో అవసరమని వివరించారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకేలా చేయడానికి ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ కుంటల నిర్మాణాల ప్రాధాన్యతను వివరించారు. గ్రామస్తులందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి పక్కా ప్రణాళిక రూపొందించారు.

ఐక్యతే ఆయుధంగా..

కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఈ మూడు గ్రామాల ప్రజలు ఐక్యతతో కార్యాచరణలోకి దిగారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటూ తక్కువ ఖర్చుతో వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షపు నీటి ప్రవాహ మార్గాలను గుర్తించి, నీటిని నిల్వ చేసే అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో మట్టి కట్టలు నిర్మించడంతో పాటు, రాళ్లను పేర్చి చిన్నపాటి నీటి నిల్వ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. గ్రామస్తులంతా కలిసి నాలుగు ఇంకుడు గుంతలు, రెండు కమ్యూనిటీ కుంటలను నిర్మించారు.

ప్రయత్నానికి ప్రకృతి తోడు..

ఐఆర్‌ఎస్ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ మార్గదర్శకత్వం, గ్రామస్తుల కృషికి ప్రకృతి కూడా తోడైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ కుంటలు నీటితో నిండిపోయాయి. ముందస్తు ఆలోచనతో నిర్మించిన ఈ నీటి నిల్వ కేంద్రాల కారణంగా ఎండిపోయిన బోర్లలో మళ్లీ నీటి లభ్యత పెరగనుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు వ్యవసాయం, పశువుల అవసరాలకు కూడా ఇవి ఉపయోగపడతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా భాగస్వామ్యమే ఆయుధం..

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా తెలంగాణ జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, బోరు బావుల రీచార్జి వంటి జల సంరక్షణ పనులను చేపడుతున్నది. నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపునకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టిన ఈ మూడు గ్రామాలు.. కరువును ఎదుర్కోవడానికి ప్రజా భాగస్వామ్యమే అసలైన ఆయుధమని చాటి చెప్పాయి. జల సంరక్షణలో కొత్త స్ఫూర్తిగా నిలిచాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>