ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరు ఎమ్మెల్యేలది.. హవా పీఏలది..

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు తమ పీఏలను, అనుచరులను, బంధువుల‌ను ముందుపెట్టి దందాలు, సెటిల్ మెంట్లు చేస్తున్నారు. పీఏలు ఎంత చెప్తే అంత.. ఎమ్మెల్యేలు సైతం ఆ సార్ చెప్పేది వినాల్సిందే.. దీంతో ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తూ.. షాడో ఎమ్మెల్యేలుగా (Shadow MLAs)  మారారు. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష నేతలు.. సొంత పార్టీ నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నా, ఇదేంటని ప్రశ్నిస్తున్న ప్రజలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. తాజాగా మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద మాజీ సర్పంచ్ భర్త ఆత్మాహత్యాయత్నం చేసి బుధవారం అర్ధరాత్రి చనిపోవడం చర్చనీయాంశమైంది. మరో వైపు తన భర్త మృతికి పీఏ మురళీధర్ రెడ్డినే కారణ మంటూ మాజీ సర్పంచ్ ధర్నా నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి కారణమనే ఆరోపణలపై సదరు ఎమ్మెల్యే స్పందించకపోగా, ఆయన పీఏ కనిపించకపోవడం వెనుక అనుమానాలకు బలం చేకూరింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

దందాలు అన్నీ ఇన్నీ కావు..

ఇసుక క్వారీ కాంట్రాక్టర్లను బెదిరించడంతో ఆయన పారిపోగా ఎమ్మెల్యే తన బినామీగా పీఏనే నియమించి క్వారీని నడుపుతున్నట్టు, ఇంకో గ్రానైట్ క్వారీ యజమానిని సైతం ముప్పు తిప్పలు పెట్టినట్లు తెలిసింది. ఇలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఎదురుతిరిగిన వారిని పోలీసు కేసుల్లో ఇరికిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆయా శాఖల నుంచి మామూళ్లు సైతం వసూళ్లు చేస్తున్నారు. పదోన్నతుల్లో పంచుకోవ డాలన్నీ షాడో ఎమ్మెల్యేనే చూసుకుంటున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు డిసైడ్ చేసేది కూడా వీరే కావడం విశేషం. కాగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును సెటిల్ మెంట్ అడ్డాగా మార్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయన మౌనం వెనుక ఆంతర్యం వేరే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామగుండం ఎమ్మెల్యే పీఏపై ఆరోపణలు రాగా కంప్లయింట్ వెళ్లడంతో సదరు ఎమ్మెల్యే కంట్రోల్ చేసినట్లు తెలిసింది. ఆ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే పీఏను తనకు కీలుబొమ్మగా మార్చుకున్నట్లు సమాచారం. ఎస్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి పీఏ చెప్పు చేతుల్లోనే నడుస్తున్నట్లు, అధికారంలో ఉన్నా లేకున్నా పనులు చక్క పెట్టుకుంటున్నారు. కరీంనగర్ పక్కన ఎస్సీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తన దగ్గర పనిచేసిన పీఏతో అభాసుపాలయ్యారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఓటమి తర్వాత పీఏను దూరం పెట్టారు.

అయ్యగారే నంబర్ వన్..

ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు సొంత పార్టీ కార్యకర్తపైనే గూండాలతో దాడి చేయించాడు ఓ ఎమ్మెల్యే పీఏ. అంతటితో ఆగకుండా అట్రాసిటీ కేసు పెట్టి వేధించారు. పీఏ వేధింపులు తాళలేక బాధితుడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్సపొందుతూ మృతిచెందాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే గెల‌వ‌డం కోసం బాధితుడు సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నాడ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు. బాధితుడి భార్య గ‌తంలో స‌ర్పంచ్ గా చేశారు. పీఏపైనా తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నా.. కానీ సదరు ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆయనకే వత్తాసు పలుకుతున్నాడని సొంతపార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు.

తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా చేయి తడపాల్సిందేనని ఆవేదనతో చెబుతున్నారు. భూ దందాలు, సెటిల్ మెంట్లు, గ్రానైట్, ఇసుక మాఫియాతో పాటు పోలీసు ట్రాన్స్ ఫర్లు, సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ వర్క్స్ లో బిల్లుల కమీషన్లు.. ఇలా ఆ ఎమ్మెల్యే చేయని దందా లేదట. చివరికి బెల్టు షాపుల్లో కూడా నెలవారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అడ్డు లేని దందాలు?

ఉమ్మడి జిల్లాలో ప్రధాన క్షేత్ర నియోజవర్గంలోని ఎమ్మెల్యే కంటే ఆయన కొడుకుదే హవా నడుస్తోంది. పోలీస్ స్టేషన్లన్నీ అతని కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. పోలీసుల బదిలీలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో బదిలీకి రూ. 10 లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా నియోజకవర్గంలో ఎక్కడా పార్టీ కార్యక్రమం జరిగినా ఆ పరిధిలోని పోలీసు అధికారే సొంతంగా ఖర్చు చేయాలని హుకుం జారీ చేశారు. అన్నిటికంటే ఆశ్చర్యానికి గురిచేసేది, ఇటీవలే ఎమ్మెల్యే కొడుకు ప్రధాన అనుచరులు ముగ్గురికి పోలీసులే డబ్బులు చెల్లించి మూడు ఎర్టీగా కార్లు కొని ఇచ్చారనే ప్రచారం ఉంది.

ఇక నియోజకవర్గంలో మట్టి దందా, ఇసుక దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎమ్మెల్యే కాకముందు అప్పుల్లో మునిగిపోయిన ఆయన తొలిసారి గెలిచాక దుబాయ్, హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్లాట్టు కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే కొడుకు సైతం ఇటీవలే రూ. కోటి విలువైన కారు కొనుగోలు చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మరో రెండు నియోజకవర్గాల్లో అక్రమ మట్టి రవాణా, ఇసుక దందా కామన్ అయిపోయింది. ఎమ్మెల్యేలే తమ అనుచరులను బినామీలుగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఓ విద్యుత్ కేంద్రం నుంచీ బూడిద తరలింపుకు స్థానిక ఎమ్మెల్యే ఏకంగా బినామీల పేరిట వాహనాలు కొనుగోలు చేసి తరలిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు చెలామణి చేస్తున్నారని తెలిసింది. తండ్రికి బదులు కొడుకు పోటీ చేసి గెలిచిన ఓ సెగ్మెంట్ లో అధికార పార్టీకి నేత అరాచకం చేస్తున్నాడని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పోలీసు, మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో వేలు పెడుతూ సంబంధిత అధికారులను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మున్సిపల్ శాఖలో ముగ్గురు అధికారులు ఆయన వేధింపులకు భయపడి డ్యూటీలో జాయిన్ కాకుండా వెళ్లిపోయారంటే, ఆయన ఆగడాలు ఎంత మితిమీరాయో తెలుస్తోంది.

దోచుకో.. దాచుకో..

బొగ్గు లారీల నుంచీ మొద‌లు ఇసుక, మ‌ట్టి లారీలు కూడా బినామీ పేర్ల‌తో న‌డిపిస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు. సాండ్, ల్యాండ్ మాఫియా అంతా వీరి క‌నుస‌న్న‌ల్ల‌లోనే న‌డుస్తోంది. నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌తి బిజినెస్ కి క‌మీష‌న్, ప్ర‌తి పోస్టింగ్ కి క‌మీష‌న్, ప్ర‌తీ ప‌నికి క‌మీష‌న్.. అన్న‌ట్టుగా సాగుతోంది. బాధితులెవ‌రైనా పోలీసు స్టేష‌న్ కి వెళితే ఎమ్మెల్యే లేదా పీఏల‌కు ఫోన్ చేసి, వారి ప‌ర్మిష‌న్ తోనే ఎఫ్ఐఆర్ లు బుక్ చేసే ప‌రిస్థితి ఉందంటే ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు ఉన్నాయో తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోంది.

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సీనియర్ మంత్రులున్నప్పటికీ అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను నిలువరించలేకపోతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షణ ఉండగా.. కానీ కరీంనగర్ జిల్లాకే లేరు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ ఆయన సిద్దిపేట జిల్లాపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుండడంతో, కరీంనగర్ జిల్లాలో నాయకత్వలేమి కనబడుతోంది. దీంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతున్నారు.

బాధితులు పోరాడలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. తొలిసారి గెలిచిన ఎమ్మేల్యేలు అవినీతి దందాల్లో రెండాకులు ఎక్కువే చదివారని స్థానికులు చర్చించుకుంటున్నారు. డి లిమిటేష‌న్ వ‌స్తే త‌మ సెగ్మెంట్ ఉంటుందో, పోతుందో, ఒకవేళ ఉన్నా, చాన్స్ వస్తుందో రాదోనని, పదవి ఉన్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలనే ఆలోచనతో దందాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>