కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ (Telangana Bandh)కు వివిధ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. నీట్ పరీక్షల నిర్వహణలో తలెత్తిన వరుస వైఫల్యాలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఇటీవల దిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, దాడులపై తక్షణమే విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విద్యా సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థి నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు దేశ విద్యావ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కేంద్రం ప్రతిపాదించిన వీబీఎస్ఏ (వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పలు యూనివర్సిటీల పరీక్షలు వాయిదా..
రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) హైదరాబాద్ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయని, వీటికి సంబంధించిన సవరించిన కొత్త తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెల్లడించారు. విద్యార్థులు గందరగోళానికి గురికావద్దని, కొత్త షెడ్యూల్ను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన అన్నీ పరీక్షలు టీయూ వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా పడింది. ఎస్యూ పరిధిలో ఇవాళ జరగాల్సిన అన్ని సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తూ ఆ పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎస్యూ పేర్కొంది. ఇవాళ జరగాల్సిన పరీక్షలను కాళోజీ ఆరోగ్య వర్సిటీ వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని కాళోజీ వర్సిటీ తెలిపింది.

