కలం, వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్ జీవనోపాధి కోసం భద్రకాళి దేవస్థానం ఎదుట ప్రైవేట్ ల్యాండ్ లో నిర్వహిస్తున్న షాపును ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా శనివారం ఉదయం కూలగొట్టారు. ఈ మేరకు శనివారం వరంగల్ కు వచ్చిన ఆయన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ తో కలిసి సదాంత్ షాప్ ను, బాధిత కుటుంబసభ్యులను సందర్శించి సానుభూతి, సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ వరంగల్ ట్రేడ్ లైసెన్స్, విద్యుత్ బిల్లులు, ప్రైవేట్ స్థల యజమానితో అగ్రిమెంట్ అన్నీ ఉన్న ప్రభుత్వంపై పోరాడుతున్నాడు అన్న కోపంతో అక్కస్సుతో నేడు షాపును కూలగొట్టారని ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ కు ఈ కూల్చివేతలు తెలియదా అని ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సదాంత్ స్వయం ఉపాధి కోసం షాప్ నడుపుతుంటే కూల్చివేతలు ఎందుకు జరిపారన్నారు. ఎస్సీ వర్గానికి ఈ ప్రభుత్వం ఎటువంటి రుణాలు ఇవ్వలేదన్నారు. సబ్ ప్లాన్ నిధులు లేవు, గురుకులాల్లో పేద పిల్లలు చనిపోతున్నారని తెలిపారు. ఇప్పటికే చిరు వ్యాపారుల పొట్ట కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల జీవనోపాధి పై పగ పట్టి కక్ష సాధిస్తుందని ఆరోపించారు. వెంటనే షాప్ యజమాని సదాంత్ కు నష్టపరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో దళిత సంఘాలు, గులాబీ శ్రేణులతో కలిసి ఉద్యమిస్తామని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
Read Also: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కవిత సంచలన నిర్ణయం ?
Follow Us On : WhatsApp


