కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026)లో ప్రత్యర్థులను ఊచకోత కోయాలని, కప్‌ను సొంతం చేసుకోవాలన్న కసి పాండ్యాలో బాగానే కనిపిస్తోంది. అందుకోసమే ప్రాక్టీస్ సెషన్‌లో చెమటోడుస్తున్నాడు. అంతేకాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మెంటార్‌షిప్‌లో ప్రత్యేక పాఠాలు నేర్చుకుంటున్నాడు పాండ్య. మార్చి 28న టోర్నీ ప్రారంభం కానుండగా.. ప్రాక్టీస్ సెషన్‌లో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు దిశానిర్దేశం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఛాంపియన్ షిప్ గెలవాలన్న కసి పాండ్యాలో ఎంత ఉందనేదని అర్థమవుతోందని అభిమానులు అంటున్నారు.
రోహిత్ శర్మ 2013 నుండి 2023 వరకు ముంబై ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలో జట్టు 158 మ్యాచ్‌లు ఆడగా, అందులో 87 విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఏకంగా ఐదు సార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2024 సీజన్‌లో జట్టు యాజమాన్యం రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆ ఏడాది ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచినప్పటికీ, 2025లో పుంజుకుని ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది.
రికార్డుల పరంగా చూస్తే, 2008 నుండి ఐపీఎల్ ఆడుతున్న 38 ఏళ్ల రోహిత్ శర్మ టోర్నీ చరిత్రలోనే రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా ఉన్నారు. ఆయన 272 మ్యాచ్‌ల్లో 7,046 పరుగులు సాధించారు. మరోవైపు 2015లో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 152 మ్యాచ్‌ల్లో 2,749 పరుగులు చేయడంతో పాటు 78 వికెట్లు పడగొట్టారు. ఈ ఆదివారం, మార్చి 29న వాంఖెడే స్టేడియంలో అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్‌తో ముంబై తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు రోహిత్, కెప్టెన్ హార్దిక్‌కు ఇస్తున్న సలహాలు జట్టు విజయావకాశాలపై సానుకూల ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు ప్రమాదం !
Follow Us On : WhatsApp

