క‌రీంన‌గ‌ర్‌లో ‘అరైవ్ అలైవ్’… రోడ్డు భ‌ద్ర‌త‌పై ప్ర‌ముఖుల సూచ‌న‌లు

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కరీంనగర్ (Karimnagar) జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. “డ్రంకన్ డ్రైవ్‌లో ఎవరైనా పట్టుబడితే రికమండేషన్ కోసం నాకు ఫోన్ చేయవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గ్రామసభల్లో భద్రతపై చర్చించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల వల్ల ఛిన్నాభిన్నమైన కుటుంబాల గాథలు మనసును కలచివేస్తున్నాయని అన్నారు. సర్పంచులు తమ గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా చర్చించాలని, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లపై శ్రద్ధ వహించాలని సూచించారు.

హెల్మెట్ ధరించడం తప్పనిసరి: సీపీ గౌస్ ఆలం

సిపి గౌష్ ఆలం మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణాలన్నారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని, ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం రూ. 25 వేల బహుమతి ఇస్తుందని తెలిపారు. ‘రహ వీర్’ పథకం కింద ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రూ. 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స అందుబాటులో ఉందని వివరించారు.

కన్నీళ్లు పెట్టించిన బాధితుల గాథలు

ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధితులు స్టేజీపై తమ ఆవేదనను పంచుకున్నారు. వారి మాటలు సభకు హాజరైన వారిని కంటతడి పెట్టించాయి. గ్రామ సర్పంచ్ శ్వేత మాట్లాడుతూ, తమ గ్రామాన్ని ఈ కార్యక్రమానికి ఎంచుకున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసుశాఖ తరఫున, ఎమ్మెల్యే చేతుల మీదుగా పలువురికి హెల్మెట్లను అందజేశారు. అంతేకాకుండా స్థానికులకు, డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. రోడ్డు నియమాలు పాటిస్తామని స్థానికులచే ప్రతిజ్ఞ చేయించారు. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమ గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖల అధికారులు, సర్పంచులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read Also: ఆర్టీసీలో సమ్మె సైరన్.. తేదీ ప్ర‌క‌టించిన జేఏసీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>