సీఎస్ఆర్ నిధులపై రాజకీయ ర‌చ్చ

కలం,  మెదక్ బ్యూరో : ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతంలో, పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR Funds) నిధులపై రాజకీయ రచ్చ నెలకొంది. వేలాది పరిశ్రమలతో కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

సీఎస్ఆర్.. ఓ సామాజిక భాద్య‌త‌

కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేయడాన్ని CSR (Corporate Social Responsibility) అంటారు. కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం పెద్ద కంపెనీలు గత మూడు సంవత్సరాల సగటు లాభాల్లో 2% CSR కార్యకలాపాలకు ఖర్చు చేయాలి. విద్య, ఆరోగ్యం, త్రాగునీరు, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శలు

కాంగ్రెస్ హయాంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి రావాల్సిన సీఎస్ఆర్ నిధులు (CSR Funds) స్థానిక అభివృద్ధికి వినియోగించకుండా ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఆయన జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. గత రెండున్నరేళ్లుగా సీఎస్ఆర్ నిధులు సరిగా రాకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

నీలం మధు ముదిరాజ్ ఆరోపణలు

మరోవైపు మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudhiraj) తీవ్ర ఆరోపణలు చేశారు. గత పన్నెండేళ్లలో పటాన్‌చెరు నియోజకవర్గ సీఎస్ఆర్ నిధుల్లో భారీ అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించారనే ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన కార్మిక శాఖ మంత్రి వివేక్‌ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో కూడా సీఎస్ఆర్ నిధులు స్థానిక ప్రాంతానికి కాకుండా ఇతర ప్రాంతాలకు మళ్లించారని ఆయన విమర్శించారు.

ఒకవైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక అభివృద్ధి కోసం సీఎస్ఆర్ నిధులు కావాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నాయకులు అవకతవకల ఆరోపణలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. పరిశ్రమల కారణంగా జల, వాయు, భూ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు సీఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు జరగాలని  కోరుతున్నారు.

Read Also: ఆర్టీసీలో సమ్మె సైరన్.. తేదీ ప్ర‌క‌టించిన జేఏసీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>