రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్!

కలం, స్పోర్ట్స్ :  ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చింది. కొన్ని రోజులుగా టీమ్ పగ్గాలను ఎవరికి అప్పగించాలన్న విషయంలో మేనేజ్‌మెంట్ తలలు పట్టుకుంది. కాగా తాజాగా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఈ జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడంతో రాజస్థాన్ యాజమాన్యం కొత్త నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర పలువురు ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసిన అనంతరం, జట్టును నడిపించడానికి పరాగ్ అత్యంత అనువైన వ్యక్తి అని ఫ్రాంచైజీ నిర్ధారణకు వచ్చింది.

ఈ రేసులో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ వారందరినీ వెనక్కి నెట్టి పరాగ్ ఈ పదవిని దక్కించుకున్నారు. గతంలోనూ పరాగ్‌కు రాజస్థాన్ జట్టును నడిపించిన అనుభవం ఉంది. ఐపీఎల్ 2025లో శాంసన్ అందుబాటులో లేని ఎనిమిది మ్యాచుల్లో అతను తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో జట్టుకు కేవలం రెండు విజయాలు మాత్రమే అందించినప్పటికీ, బ్యాటర్‌గా పరాగ్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చేసిన 95 పరుగులు అతని కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచాయి.

కేవలం ఐపీఎల్ (IPL) మాత్రమే కాకుండా, దేశవాళీ క్రికెట్‌లో అస్సాం జట్టుకు పరాగ్ (Riyan Parag) సుదీర్ఘకాలం కెప్టెన్‌గా సేవలందించారు. అన్ని ఫార్మాట్లలో భయం లేని ఆటతీరు మరియు వ్యూహాత్మక ఆలోచనలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. దేశవాళీ పోటీల్లో మరియు ఐపీఎల్‌లో చూపిన ప్రతిభే అతనికి టీమ్ ఇండియాలో చోటు సంపాదించి పెట్టింది. అయితే భుజం గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమైన పరాగ్, ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఈ మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also : ఉత్తర కొరియా.. కిమ్ వారసురాలికి పగ్గాలు..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>