కలం, వెబ్ డెస్క్ : 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) శాసనసభకు రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో తనకు పూర్తిగా తెలుసని అన్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, అలాగే ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తన అనుభవంతో కేసీఆర్ సలహాలు, సూచనలు ఇస్తారని తాము ఎంతో ఆశించామని పేర్కొన్నారు. అందుకే కృష్ణా, గోదావరి జలాలపై చర్చించడానికి ప్రత్యేకంగా ఆహ్వానించామని గుర్తు చేశారు.
శాసనసభకు (Telangana Assembly) ఒక పవిత్రత ఉంటుందని, ఇక్కడ జరిగే చర్చలను, వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సభలో అబద్ధాలకు గానీ, మాటల గారడీలకు గానీ చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆశయాలే ప్రాతిపదికగా సాగాల్సిన ఈ వేదిక రాజకీయ ప్రయోజనాలకు వేదిక కాకూడదని హితవు పలికారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ఈ సభ ప్రతిరూపమని, ఇక్కడ మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు.
గడచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదని, తాము పదే పదే విజ్ఞప్తి చేసినా స్పందన లేదని సీఎం మండిపడ్డారు. సభలోకి రాము, చర్చలో పాల్గొనం అని హరీష్ రావు మాట్లాడటం చట్టసభలను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ మాట్లాడుతూ సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తాం, తోలు తీస్తాం అని వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తూ, ఒకవేళ వారు చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు, ఎవరి తోలు ఎవరు తీస్తారు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలిసేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎద్దేవా చేశారు.
Read Also: హరీశ్‌రావు గొంతు నొక్కిన కేసీఆర్ !
Follow Us On: Sharechat


