కలం, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యత దక్కుతోందనే చర్చ తెలంగాణ (Telangana) రాజకీయాలలో మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనిపించిన ఇదే ధోరణి.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులు లేని నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు నెమ్మదిస్తున్నాయని, నిధుల కొరతతో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రులు తమ నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దీంతో ఇతర నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచాయని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. ఈ ప్రాంతాలలో ఆధునిక కలెక్టరేట్‌లు, రహదారులు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఐటీ టవర్‌లు , మార్కెట్ యార్డులు, చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు వేగంగా అమలయ్యాయని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తెలంగాణ అంటే కేవలం ఆ మూడు నియోజకవర్గాలేనా అంటూ అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేశారు. సీడీపీ, ఎస్‌డీఎఫ్ నిధులలో అసమానతలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కూడా అప్పుడప్పుడు ఇలాంటి అసంతృప్తి వ్యక్తమైంది.
ఇప్పుడు కొడంగల్, మధిర, పాలేరు, హుజూర్‌నగర్‌పై ఫోకస్?
కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలైన మధిర, పాలేరు, హుజూర్‌నగర్, మంథని, ములుగు ప్రాంతాలలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెబుతున్నాయి. గ్రామీణ మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, రోడ్లు, తాగునీటి వసతులు, విద్యా–వైద్య రంగ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు వంటి అంశాల్లో మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా, అభివృద్ధికి ప్రయోగశాలగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఎడ్యుకేషన్ క్యాంపస్, రైల్వే లైన్, రోడ్డు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్క్ వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే పలు మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మంత్రుల నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పథకాలు, విద్యా, వైద్య రంగ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం పాలేరులో ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఆసుపత్రి, రోడ్లు, సాగునీటి పనులు, గ్రామీణ మౌలిక వసతులపై దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు. హుజూర్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, కళాశాల భవనాలు, ఆస్పత్రి విస్తరణ వంటి పనులు కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం సహజమే అయినప్పటికీ, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల్లో సమతుల్యత పాటించాలనే డిమాండ్ ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి వినిపిస్తోంది.

