కలం, నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలకు చెందిన రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న పోడు భూములు, వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. రైతుల సమస్యలను కార్యాలయాల్లో కాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలనే లక్ష్యంతో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) గురువారం సోమశిలలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తూ సమస్యల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతుల సమక్షంలోనే ఒక్కో సమస్యను పరిశీలిస్తూ అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశానికి జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.
ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో రైతులకు తమ భూ సమస్యలను నేరుగా వివరించే అవకాశం కల్పించడం సమావేశానికి ప్రత్యేకతగా నిలిచింది. ఒక్కో గ్రామానికి చెందిన రైతులను విడివిడిగా పిలిపించి వారి సమస్యలను మంత్రి విన్నారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులను అక్కడికక్కడే వివరణ కోరుతూ సమస్యల మూలాలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
భూమి రైతుకు జీవనాధారం అని, అలాంటి భూములకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగడం వల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులు దరఖాస్తు చేసిన తర్వాత నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.
ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని మంత్రి హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా పనిచేయాలని, రైతులను ఇకపై కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.

