epaper
Tuesday, November 18, 2025
epaper

‘మొంథా’ తుపానుపై సీఎం రేవంత్ ఆరా..

తెలంగాణలోని పలు జిల్లాలపై మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తుపాను ప్రభావంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తుపాను వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లోనూ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం సూచించారు. మొంథా తుపాను ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండ‌డం.. హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు.

మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ జంక్ష‌న్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమ‌డుగు స్టేష‌న్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవ‌డం.. ప‌లు రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు దారి మ‌ళ్లించిన నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. మొంథా తుపాన్ ప్ర‌భావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని.. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాల‌కు త‌గిన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని సీఎం సూచించారు.

రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌న్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సీఎం ఆదేశించారు. తుపాను ప్ర‌భావంతో వ‌ర్ష‌పు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని… అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య‌, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో సాగాల‌ని సీఎం(Revanth Reddy) సూచించారు.

Read Also: వాట్సాప్‌లోకీ వచ్చేసిన సజ్జనార్..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>