కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ (Mudigonda) మండలంలో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేస్తూ, మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మండలంలోని ఎడవల్లి లక్ష్మీపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు రూ. 20 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించిన ఈ భవనం ద్వారా గ్రామస్థులకు పరిపాలన మరింత చేరువ అవుతుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులకు, గృహ, వాణిజ్య అవసరాలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను అందించే దిశగా ఎడవల్లి గ్రామంలో నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 3.15 కోట్ల వ్యయంతో ఈ సబ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. దీంతో పాటు ముదిగొండ మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఈఆర్వో కార్యాలయానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
ముదిగొండలో రవాణా రంగం బలోపేతం
ముదిగొండ మండల పరిధిలో రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు, గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందులో భాగంగా పలు కీలక రహదారుల నిర్మాణ, విస్తరణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టారు. ఎడవల్లి నుంచి తల్లంపాడు వరకు రహదారి విస్తరణ పనులకు, అలాగే ఎడవల్లి నుంచి లక్ష్మీపురం మీదుగా తెల్దారుపల్లి వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన జాతీయ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎన్.హెచ్ 365ఏ (కోదాడ-ఖమ్మం-కురివి), ఎన్.హెచ్ 365బీబీ (సూర్యాపేట-అశ్వారావుపేట) జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా రూ. 33 కోట్ల భారీ నిధులతో చేపట్టనున్న పనులకు ఆయన లాంచేనంగా భూమిపూజ చేశారు. ఈ రహదారుల అభివృద్ధితో ఈ ప్రాంత వాసుల రవాణా కష్టాలు శాశ్వతంగా తీరడమే కాకుండా, పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముదిగొండ మండల కేంద్రంలో రూపుదిద్దుకుంటున్న 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదని, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డిలతో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

