Mobile Popup Ad
Mobile Popup Ad

సివిల్‌ సప్లై మంత్రి జిల్లాలో దయనీయంగా ధాన్యం కొనుగోళ్లు

కలం, నల్లగొండ బ్యూరో: యాసంగి సీజన్ ముగిసి.. వానాకాలం సీజన్ కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. నల్లగొండ (Nalgonda) జిల్లాలో మాత్రం ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదు. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 459 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే.. ఇంకా 87 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఖాళీ కాలేదు. నెల రోజులకు పైగా ఎదురుచూస్తే తప్ప కాంటాలు కాని పరిస్థితి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు గన్నీ సంచులు, కేంద్రాలను ఏర్పాటు చేసినా అధికార యంత్రాంగం చేతులేత్తేసిందని రైతులు మండిపడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మరో కీలక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదు.

ముందస్తు ప్రణాళికనే లేదు..

నల్లగొండ జిల్లాలో యాసంగి సీజన్‌లో 6.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ పరిధిలో 459 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని లెక్కలు వేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమలు చేయడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సీజన్ ప్రారంభానికి ముందే కలెక్టర్ చంద్రశేఖర్ సివిల్ సప్లై, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో ఎంత విస్తీర్ణంలో వరి సాగైంది? ఎంత దిగుబడి రావచ్చు? ఎన్ని కొనుగోలు కేంద్రాలు అవసరం? రవాణాకు ఎన్ని లారీలు కావాలి? గన్నీ సంచుల నిల్వలు ఎంత ఉన్నాయి? అనే అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో విఫలమయ్యారు. కలెక్టర్ అడపాదడపా ఐకేపీ కేంద్రాలను సందర్శించారే తప్ప, కొనుగోళ్లు వేగవంతం చేసే చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. పలు మండలాల్లో కొనుగోళ్లను పర్యవేక్షించాల్సిన తహసీల్దార్లు సైతం చేతులెత్తేశారు.

మిల్లర్లపై చర్యలతో గట్టిగానే ప్రభావం..

నల్లగొండ జిల్లాలో కొనుగోళ్లు ఇంతలా మందగించడానికి పలు కారణాలున్నాయనే ప్రచారం సాగుతోంది. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం మాయం చేశారనే ఆరోపణలపై కొంత మంది రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి, అరెస్టులు చేయడం సంచలనం సృష్టించింది. జిల్లాలో రైస్ మిల్లింగ్ పరిశ్రమలో అత్యధిక శాతం ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉండటంతో ఈ అరెస్టులు వారిలో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మిల్లర్లు సహాయ నిరాకరణకు దిగారు. దీంతో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. కలెక్టర్ చొరవ తీసుకుని, వారితో చర్చలు జరిపి భరోసా ఇచ్చి ఉంటే పరిస్థితి సద్దుమణిగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు మిల్లర్లు మొండికేయడం, ఇటు అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో చివరకు అన్నదాతలు రోడ్లపైకి వచ్చారు. ఐకేపీ కేంద్రాల్లో వారాల తరబడి వేచి చూడటం, అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించి, మిల్లర్లతో ఉన్న వివాదాలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>