కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. హైడ్రా ఏర్పాటుకు హిట్లర్ స్ఫూర్తి అంటూ రేవంత్ పేర్కొనడంపై మండిపడ్డారు. ‘నీకు స్ఫూర్తి హిట్లర్. నీ హత్యలు చేసే సంస్థ హైడ్రా, నువ్వు నియంతలను ఆరాధిస్తుంటావ్, కూల్చివేతల గురించి గొప్పగా చెప్పుకుంటావ్. ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు ఇప్పటికే తెలిశాయి. దేశ ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్. మేము నీ అంత తెలివైన వాళ్లం కాదు రేవంత్. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, మహాత్మా గాంధీ విజన్, ప్రొఫెసర్ జయశంకర్ కలలను మా అభివృద్ధికి మోడల్‌గా ఎంచుకున్నాం’ అని పేర్కొన్నారు.
రేవంత్ హైడ్రా వ్యాఖ్యలపై చర్చ..
నిన్న బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు హిట్లర్ స్ఫూర్తి అని పేర్కొనడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అంతేగాకుండా హైడ్రా కూలగొట్టిన ఇళ్లు గాజాలో కూలిపోయిన ఇళ్ల మాదిరి ఉన్నాయంటూ వ్యాఖ్యానించడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ చేస్తున్నాయి.

