కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జూన్ 6వ తేదీ నుండి ఈ కుటుంబం ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి చెందిన గిరి శ్రీకాంత్ (44), ఆయన భార్య లక్ష్మీ (42), కుమార్తె హర్షిత (23), కుమారుడు సాయి చరణ్ (20) దాదాపు ఆరేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నల్గొండకు వలస వచ్చారు.
పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసముంటూ, దంపతులిద్దరూ స్థానిక కిరాణా దుకాణాల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, జూన్ 6 నుంచి ఈ నలుగురి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల అదృశ్యంపై సమాచారం అందుకున్న నల్గొండ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా, లేదా ఎక్కడైనా ఆచూకీ లభించినా వెంటనే కింద పేర్కొన్న 8712667670, 8712577228 నంబర్లలో పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.

