కలం, వరంగల్ బ్యూరో : చారిత్రక జనగామ (Jangaon).. జిల్లాగా ఏర్పాటైన తర్వాత సంచలనాలకు వేదికగా మారింది. 2016 తర్వాత నుంచి ఏదో ఒక సందర్బంలో జనగామ రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ విచిత్రమేమిటంటే జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు కయ్యానికి కాలు దువ్వుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2016లో జనగామ తొలి కలెక్టర్ (Jangaon Collector) దేవసేన నుంచి ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజల వద్ద నుంచి మాత్రం కలెక్టర్ పట్ల ఆదరణ తగ్గకపోవడం చర్చకు దారితీస్తోంది.
సంచలనాల కలెక్టర్ ..
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంచలనాలకు కేంద్రంగా మారారు. ఆయన జనగామ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. మొదట్లో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో వైరం, ఇప్పుడు జర్నలిస్ట్ ల అక్రిడియేషన్ల జారీలో పోలీసుల జోక్యం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు జర్నలిస్ట్ లకు ఫోన్లు చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం పై జర్నలిస్ట్ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసాయి. ఈ నేపథ్యంలో జనగామ కలెక్టర్ తీరు పై ఒకవైపు రాజకీయ నాయకులు, మరోవైపు జర్నలిస్టులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
నాడు దేవసేన.. నేడు సందీప్ కుమార్ ఝా:
జనగామ జిల్లాలో కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులకు పొసగడం లేదనే వాదనలున్నాయి. సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య వైరుద్యాలు, వైషమ్యాలు ఉండడం సహజం. కానీ జనగామ జిల్లా ఏర్పాటైన నాటి నుంచి ఎమ్మెల్యేలు, కలెక్టర్ల మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. 2016లో జనగామ జిల్లాగా ఏర్పాటైన తర్వాత తొలి కలెక్టర్ గా దేవసేన భాద్యతలు చేపట్టారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తో ఆమెకు వైరం కొనసాగింది. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట అభివృద్ధి విషయంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే, అతడి అనుచరులు కారణమంటూ కలెక్టర్ మీడియా ఎదుట వ్యాఖ్యలు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే ఈ విషయాన్ని అప్పటి సీఎం, మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు కలెక్టర్ బదిలీ అయ్యారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. సరిగ్గా పదేళ్ల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమాలకు కలెక్టర్ రావడం లేదని, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే రికమండేషన్ లెటర్స్ పట్టించుకోకుండా ధరణి దరఖాస్తులు రిజెక్ట్ చేస్తున్నారని వాదనలు సైతం ఉన్నాయి. అంతేగాకుండా కలెక్టర్ ఇటీవలి వరకు ఓ వివాదం ఎదుర్కొన్నారు. జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు దళిత మహిళలు ఇందిరా మహిళా శక్తి పథకం కింద రుణాలు మంజూరు కాగా కలెక్టరేట్ ముందు టీ స్టాల్, పాల కేంద్రం పేరిట డబ్బాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి దళిత మహిళల డబ్బాలను మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. దీనిపై మహిళలు అధికారులను ప్రశ్నించగా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించమని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ కి చెందిన కౌన్సెలర్ వారికి సంఘీభావం ప్రకటిస్తూ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు మహిళలు కులం పేరుతో దూషించి, ఉపాధి దెబ్బతీశారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. హైకోర్టులో పిల్ సైతం వేశారు. తరువాత వారు కేసు విత్ డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది.
కలెక్టర్ పై మంత్రికి ఫిర్యాదు ..
ప్రభుత్వం జర్నలిస్ట్ లకు జారీ చేసే అక్రిడియేషన్ కార్డుల విషయం జనగామ జిల్లాలో చర్చ నడుస్తోంది. ఆయా సంఘాల నాయకులు అందజేసిన జాబితా మేరకు కలెక్టర్ అధ్యర్యంలో కమిటీని నియమించారు. అయితే అర్హులైన జర్నలిస్ట్ లను ఎంపిక చేసే విషయంలో కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయం కాస్తా సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అసలైన జర్నలిస్ట్ లు ఎవరో గుర్తించే క్రమంలో కార్డుల ప్రక్రియని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా జర్నలిస్ట్ లకు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ల నుంచి విచారణ పేరిట ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల జర్నలిస్టుల విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

