epaper
Wednesday, February 18, 2026
epaper

వరంగల్ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ హైలైట్స్

కలం, వరంగల్ బ్యూరో: బీఆర్ఎస్ అంటేనే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి, ఆ పార్టీ నేతలు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వంద‌ల కోట్లు దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  ఆరోపించారు. ఆదివారం భూపాల‌ప‌ల్లి బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ‘బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో 1500 కోట్లు ఎవ‌డ‌బ్బ సొమ్ము? వ్యాపారుల‌ను బెదిరించి భూముల‌ను రాయించుకున్నారు. బీఆర్ఎస్ నేతలు  చేసిన పాపాలు ఊరికే పోవు.. పాపాల ఊబిలో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోతుంది’ అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ‌లు వేరు వేరు కాదు బొమ్మ‌, బొరుసులా.. బిల్లా రంగ‌లా.. కాంగ్రెస్‌ను ఓడించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

భూపాల‌ప‌ల్లి‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయాలి

భూపాలపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు తాత‌లు.. ముత్తాత‌లను తీసుకువ‌చ్చినా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వాళ్ల సంగ‌తి చూస్తారన్నారు. ‘మా అక్క‌లు దసరా పండుగ రోజు పాల‌పిట్ట‌ల్లా క‌నిపిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల‌ను బాయి కాడ పిట్ట‌ల‌ను బెదిరించ‌డానికి కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.  ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇందిర‌మ్మ చీరెను సారె రూపంలో పెట్టిందని గుర్తు చేశారు. ప్ర‌తి ఏడాది ఇందిర‌మ్మ చీర‌ను సారెగా త‌ప్ప‌కుండా ఇస్తామన్నారు. ఆడ‌బిడ్డ‌ల ఆశిర్వాదం ఉంటే మోడీ, కేసీఆర్ తాత వ‌చ్చినా ఓడిస్తామన్నారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు గొప్ప చ‌రిత్ర

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు గొప్ప చ‌రిత్ర ఉందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ప్ర‌పంచంలోనే భార‌తదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌రసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ‌ అని కొనియాడారు. తొలి తెలంగాణ‌, మ‌లి తెలంగాణ ఉద్య‌మంలో కాక‌తీయ‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారని తెలిపారు. తెలంగాణ ఉద్య‌మంలో క‌ర్త‌, క్రియగా కాక‌తీయ యూనివ‌ర్సిటీ విద్యార్థులు వ్యవహరించారని పేర్కొన్నారు. తెలంగాణ‌ను సాధించ‌డంలో ముందుభాగంలో నిల‌బ‌డ్డ ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఈ ప్రాంత‌పు బిడ్డ‌ అని కొనియాడారు.

సింగరేణి కార్మికులు దేశానికే ఆదర్శం

న‌ల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగ‌రేణి కార్మికులు ఈ దేశానికే ఆద‌ర్శంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో వేలాది మంది సింగ‌రేణి కార్మికులు పిడికిలి బిగించి పాల్గొన్నారన్నారు. ఎన్టీఆర్ మొద‌ట భూపాల‌ప‌ల్లిని మండ‌ల కేంద్రంగా మార్చి బొగ్గు వెలికితీత‌కు పునాదిరాయి వేశారన్నారు. భూపాలప‌ల్లి జిల్లాను ర‌ద్దు చేస్తార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ జిల్లాను తొల‌గించ‌డం కాని, కొత్త జిల్లాను ఏర్పాటు చేయ‌డం కాని ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పునర్విభజనపై అంద‌రి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చ‌ర్చ చేసి న త‌ర్వాత దీని పైన ఆలోచ‌న చేస్తామన్నారు. కుట్ర‌లు, కుతంత్రాల‌తో విష ప్ర‌చారాలు చేస్తున్న‌వారిని గ‌మ‌నించాలని సూచించారు. భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదని సీఎం స్పష్టం చేశారు. తాత్కాలిక రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని విమర్శించారు.

సింగ‌రేణి కార్మికులకు సంబంధించిన మెడిక‌ల్ అన్ ఫిట్ బోర్డు ను ర‌ద్దు చేస్తామన్నారు. సింగ‌రేణి వార‌స‌త్వ ఉద్యోగాలపైన కొంద‌రు విష ప్ర‌చారం చేస్తున్నారని తెలిపారు. మెడిక‌ల్ బోర్డు పైన విష ప్ర‌చారం చేసే వారిని మోకాలిపైన కూర్చొబెట్టాలన్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు న్యాయం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తుందన్నారు. సింగ‌రేణికార్మికులు నిండు మ‌న‌సుతో ప‌నిచేసి కాంగ్రెస్ జెండాను మోయ‌డం వ‌ల్ల‌నే ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలో ఉందన్నారు. ఈ ప్ర‌భుత్వం సింగ‌రేణి కార్మికుల‌ది.. వారికి న‌ష్టం క‌ల్గించే ప‌నిచేయన్నారు. 217 డిస్మిస్ కార్మికుల స‌మ‌స్య‌ను త‌ప్ప‌కుండా పరిష్క‌రిస్తుందన్నారు.

వైఎస్ హ‌యాంలో 25 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు

డ‌బ‌ల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామ‌ని కేసీఆర్ మాట‌లు చెప్పాడు వెయ్యి ఎక‌రాల్లో కేసీఆర్ ఎర్ర వ‌ల్లిలో, 100 ఎక‌రాల్లో జ‌న్వాడ లో కేటీఆర్ , హ‌రీష్ రావు, క‌విత, సంతోష్ రావుల‌కు ఫామ్ హౌస్ లు క‌ట్టుకున్నారన్నారు. ఒక్క కేసీఆర్ క్లాస్ మెంట్ జాహంగీర్ కు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ రాలేదన్నారు. టీవీలు, పేప‌ర్లు, వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారాలు కేసీర్ కుటుంబానికి వ‌చ్చాయి..కాని పేద‌ల‌కు డ‌బ‌ల్ బెడ్రూం ఇళ్లు రాలేదన్నారు. యేడాది కి 2 ల‌క్ష‌ల ఇళ్లు క‌డితే ప‌దేళ్ల‌లో 20 ల‌క్ష‌ల‌ ఇళ్లు క‌ట్టే అవ‌కాశం కేసీఆర్ కు ఉండేదా అన్నారు. కానీ పేద‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ప‌ట్టించుకోలేదు..పేద‌ల‌పైన ఆయ‌న‌కు ప్రేమ లేదన్నారు. భూపాలప‌ల్లి లో రైతు పోరాట బాట‌, కార్మికుల పోరు బాట తాను గ‌తంలో నిర్వ‌హించినట్లు తెలిపారు.

పేదల ఆత్మగౌరవం పెంచుతాం

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. 22,500 కోట్ల‌తో 4.5 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. వ‌చ్చే బ‌డ్జెట్ లో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేద‌ల ఆత్మ‌గౌర‌వం పెరిగేలా , ఆడ‌బిడ్డ‌లు ఆశ్వీర‌ధించేలా ఇందిర‌మ్మ ఇళ్లు రెండో విడ‌త మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘స‌ర‌స్వ‌తి పుష్క‌రాలు అద్భుతంగా నిర్వ‌హించుకున్నాం.1000 ఏళ్లు గుర్తుండేలా మేడారం ఆల‌యం నిర్మించాం. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌ను అద్భుతంగా నిర్మించాం‘ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జంప‌న్న వాగు నుంచి రామ‌ప్ప చెరువుకు నీళ్లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తామని సీఎం తెలిపారు.

కొండా సురేఖ‌ (Konda Surekha), సీత‌క్క (Seethakka) మేడారం జాత‌ర‌ను అద్భుతంగా నిర్వ‌హించారని అభినందించారు. 2027 లో రాబోయే గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా బాస‌ర నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు ప‌ర్యాట‌క ప్రాంతంగా 3,4 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. గోదావ‌రి ప‌రిహాక ప్రాంతాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ సీఎం గా, మూడు సార్లు ప్ర‌ధాని మోడీగా ఉన్నారు.. కేసీఆర్ , మోడీ చూసి ఓటు వేయాల‌ని బీఆర్ఎస్, బీజేపీ చెపుతున్నాయి.. గ‌ల్లీలో మోరీలు కేసీఆర్ వ‌చ్చి తీస్తాడా..? అని ప్రశ్నించారు.

కేసీఆర్, మోడీని చూసి ఓటేస్తే మోసపోతారు

కేసీఆర్, మోడీ బొమ్మ‌లు చూపించి ఓట్లు అడిగేందుకు కొంతమంది వస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎర్ర‌వెల్లి పామ్‌హౌస్‌లో బోర్లా బొక్క‌లా ప‌డుకున్న కేసీఆర్ మీకు నిధులు ఇవ్వ‌డన్నారు. ప‌దేళ్లు సీఎంగా ఉండి భూపాల‌ప‌ల్లి కి బై పాస్ రోడ్డు తీసుకురాలేదు. మోడీ ఏ నాడు భూపాలప‌ల్లికి రాలేదన్నారు. కేసీఆర్, మోడీని చూసి ఓటు వేస్తే మోస‌పోతారు జాగ్ర‌త్త‌ అని హెచ్చరించారు. తెలంగాణ లో మున్సిపాలిటీలు, కార్పేరేష‌న్ల కు 17,442 కోట్లు మంజూరు చేశామన్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలోని మున్సిపాలిటీ ల‌కు 6116 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.. భూపాల‌ప‌ల్లి మున్సిపాలిటీకి 92 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. మున్సిప‌ల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీరు తిక్క‌లోడు తిరునాళ్ల‌కు పోయిన‌ట్లుందని విమర్శించారు.

కేసీఆర్ ఇంటిల్లిపాలికి ప‌ద‌వులు ఇచ్చుకున్న‌డు..కాని పేద‌ల‌కు ఏమీ చేయ‌లేదన్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు గెలిపిస్తే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి కేసీఆర్ సంక‌ను చేరాడని, ఎవ‌ర‌కి వారు వాళ్లు త‌మ సామాజిక వ‌ర్గం పేరుతో న‌న్ను పిల్చుకున్నారు.. ఎవ‌రు ఎలా పిలిచినా సంతోషిస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు, జ‌డ్జిలు, సినీతార‌ల‌ను వ‌ద‌ల‌లేదు, భార్య‌భ‌ర్త‌లు ఫోన్లు విన్న పాపాత్ముడు ఎవ‌రైనా ఉంటారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘వ్యాపారుల‌ను బ్లాక్ మెయిల్ చేశారు. వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి మాట‌లు విని ఆస్తులు రాయించుకున్నార‌ని బీజేపీ ఎంపి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి స్వ‌యంగా చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు.

Read Also: మున్సిపోల్స్.. కుంభస్థలంపై కాంగ్రెస్ ఫోకస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>