Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందిరమ్మ ఇండ్లపై పొంగులేటి కీలక ఆదేశాలు

కలం, తెలంగాణ బ్యూరో : ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, అందులో భాగమే పేద కుటుంబాలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలనే స్కీమ్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) నొక్కిచెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం సేకరించి పూర్తి స్థాయిలో వినియోగించకుండా మిగిలి ఉన్న భూముల్లో అర్హులైనవారికి ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరైనా వివిధ కారణాలతో నిర్మాణాలను పూర్తి చేయనివారికి కూడా వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎక్కువ అధికారాలను కలెక్టర్లకే అప్పగించామని మంత్రి (Minister Ponguleti Srinivas Reddy) గుర్తుచేశారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో పై అంశాలను స్పష్టం చేశారు.

సకాలంలో బిల్లుల విడుదలకు ప్రయారిటీ :

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇచ్చి, మొదటి బిల్లు వారి ఖాతాల్లో జమ అయిన లబ్ధిదారులందరికీ తదుపరి విడతల్లో చెల్లించాల్సిన బిల్లులన్నింటికీ నిధులు సకాలంలోనే విడుదలయ్యేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా, పూర్తి పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తూ అర్హులైన వారికే ఫలాలు దక్కేలా చూడాలన్నారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సొంత ఇల్లు, భూమి ప్రతీ కుటుంబానికి ఆత్మగౌరవ ప్రతీక అని, పేద కుటుంబాలకు భద్రమైన భవిష్యత్తు అని పేర్కొన్నారు. వీటిని కల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి అన్నారు. పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని, అందుకే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని నొక్కిచెప్పారు.

సమన్వయంతోనే సత్ఫలితాలు వస్తాయి :

సంక్షేమ పథకాల అమలులో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం చాలా ముఖ్యమైన అంశమని, జిల్లా అధికార యంత్రాగమంతా అలాంటి సమన్వయంతో పనిచేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఫలితాలు వస్తాయని మంత్రి వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు సహా అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు.  జిల్లా స్థాయిలో హౌజింగ్ డైరెక్టర్లు బాధ్యతగా విధులను నిర్వహించాలని, లబ్ధిదారులకు ఉన్నతాధికారులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణపు పనులు ఏ స్థాయిలో ఉన్నా ఈ నెల 20 వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. అర్హులైన పేదలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని వివరించారు.

అదనపు ఎమ్మార్వోల నియామకం :

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ కార్యాలయాలన్నిటినీ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లోనే నెలకొల్పేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా, అదనంగా మరో తహశీల్దార్‌ను నియమించనున్నామని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ వివాదాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జాయింట్ సర్వే అవసరమన్నారు. భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్‌మెంట్స్, భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. భూ రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Read Also: కొత్త మంత్రులు ఎవరు? AICCతో సీఎం రేవంత్ కీలక భేటీ!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>