Mobile Popup Ad
Mobile Popup Ad

పేరెంట్స్‌ను వేధించిన కొడుక్కి జైలు శిక్ష‌.. డీసీపీ బృందానికి స‌జ్జ‌నార్ ప్ర‌శంస‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: వృద్ధులైన త‌ల్లిదండ్రుల‌ను అత్యంత అమాన‌వీయంగా హింసించిన ఓ కొడుకుపై హైద‌రాబాద్ పోలీసులు త‌క్ష‌ణ‌మే స్పందించి 60 రోజులు శిక్ష ప‌డేలా చేశారు. ఈ ఘ‌ట‌న‌పై సీపీ స‌జ్జ‌నార్ స్పందిస్తూ పోలీసుల‌ను అభినందిస్తూ, కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నారాయణగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే ప్రైవేట్ ఉద్యోగి తన వృద్ధ తల్లిదండ్రులను నిరంతరం వేధిస్తూ వస్తున్నాడు. భరించలేకపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, నారాయణగూడ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 70బీ సీపీ యాక్ట్, 115(2) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పూర్తి ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని నాంపల్లిలోని ఐదవ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఎం.భాస్కర్ నిందితుడికి 60 రోజుల జైలు శిక్ష, రూ.50 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌పై ఖైర‌తాబాద్ జోన్ డీసీపీ శిల్ప‌వ‌ల్లి ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ల్లిదండ్రుల‌ను ఇంత అమాన‌వీయంగా చూస్తారా అంటూ మండిప‌డ్డారు. ఆ కొడుక్కి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని వ్యాఖ్యానించారు. వృద్ధుల‌కు గౌర‌వం, సంర‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని, ఒక రోజు మ‌నం కూడా ఆ వ‌య‌సుకే వ‌స్తామ‌ని గుర్తుంచుకోవాల‌ని పేర్కొన్నారు. ఈ పోస్టుకు హైద‌రాబాద్ న‌గ‌ర‌ సీపీ స‌జ్జ‌నార్ స్పందించారు. స‌కాలంలో స్పందించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న డీసీపీ శిల్ప‌వ‌ల్లి, నారాయ‌ణ‌గూడ పోలీసు బృందాన్ని ఆయ‌న అభినందించారు. ఇలాంటి నిందితుల‌ను చ‌ట్టం అస్స‌లు వ‌దిలిపెట్ట‌ద‌ని, వేధింపుల‌పై మౌనంగా ఉంటే నేర‌స్థుల‌కు మ‌రింత తెగింపు పెరుగుతుంద‌ని, అందుకే త‌క్ష‌ణ చ‌ర్య‌లు చాలా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్ భావోద్వేగానికి గుర‌య్యారు. త‌ల్లిదండ్రులు త‌మ జీవిత‌మంతా మ‌న‌ల్ని ర‌క్షించ‌డానికి, మ‌న ఎదుగుద‌ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ మ‌న బ‌ల‌హీన క్ష‌ణాల్లో మ‌న‌కు అండ‌గా నిలుస్తార‌న్నారు. అలాంటి త‌ల్లిదండ్రుల ప్ర‌శాంత‌తను, సంర‌క్ష‌ణ‌ను ఆశించే వృద్ధాప్యంలో అవ‌మానాల‌ను, వేధింపుల‌ను ఎదుర్కోవ‌డం చూడ‌టం చాలా బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎలాంటి ప‌రిస్థితుల్లో కూడా త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌కుండా ఉండ‌టాన్ని స‌మ‌ర్థించ‌లేమ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. వృద్ధుల‌ను గౌర‌వించ‌డం అనేది దాతృత్వం కాద‌ని, అది క‌నీస మాన‌వ‌త్వ‌మ‌ని గుర్తు చేశారు. ఎక్క‌డైనా వృద్ధులపై వేధింపులు జ‌రుగుతుంటే వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని స‌జ్జ‌నార్ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>