కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగరంలో ఏనుమాముల మార్కెట్ (Enumamula Market) సమీపంలో ఉంటున్న ప్రజలు నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఎండతీవ్రతకు తోడు మరో సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పగలంతా ఎండ తీవ్రతకు ఆయా కాలనీలవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. చీకటిపడ్డ తర్వాత కునుకు తీద్దామంటే కూడా వీలులేకుండా పోయింది. కారం ఘాటుకు తెల్లవార్లు దగ్గుతూ జాగరణ చేయాల్సిన దుస్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. అసలు కాలనీ వాసులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఈ సమస్యకు కారణం ఏమిటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
మిర్చి ఘాటుతో ఉక్కిరిబిక్కిరి
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు (Enumamula Market) మిర్చీ వ్యాపారానికి ప్రసిద్ధి. ఈ మార్కెట్‌కు సీజన్ బాగా ఉన్న రోజుల్లో ప్రతిరోజు 30 వేల బస్తాల మిర్చి వస్తూ ఉంటుంది. రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు అక్కడే కల్లాల్లో ఆరబెడతారు. మిర్చి ఎండిన తర్వాత సగానికిపైగా మార్కెట్ సమీపంలో ఉన్న సుమారు 30 కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరుస్తారు. మిగిలిన తొడిమెలు తీసి పౌడర్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. అయితే మిర్చి నుంచి వేరు చేసిన తొడిమెలను జన సంచారం లేని నిర్మానుష్య ప్రాంతానికి తరలించాలి. కానీ వ్యాపారులు రవాణా ఖర్చులు మిగిల్చుకునేందుకు మార్కెట్ పరిసరాల్లో పారబోసి రాత్రి వేళ మంటల్లో తగల బెడుతున్నారు. ఆ మంటల ద్వారా ఘాటైన పొగ సమీప కాలనీలకు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
పొగఘాటుతో వృద్ధుల అవస్థలు
జనవాసాల్లో మిర్చి తొడిమెలు కాల్చడం ద్వారా సమీప ఎన్టీఆర్ నగర్, సుందరయ్య నగర్ తో పాటు కొన్ని కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సదరు వ్యాపారులు రాత్రి పూట ఎవరు లేని సమయంలో మిర్చి తొడిమెలను కుప్పగా వేసి మంట పెట్టి అక్కడి నుంచి చల్లగా జారుకుంటున్నట్లు తెలిసింది. మంటల ద్వారా ఘాటైన పొగ కాలనీలకు వ్యాపిస్తుండడంతో వృద్దులు, అస్తమా రోగులు, హృద్రోగులు, గర్భిణీలు విపరీతమైన దగ్గుతో నరకం అనుభవవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి స్థానిక కాంగ్రెస్ నాయకులు మహేష్, పలువురు కార్యకర్తలు సదరు వ్యాపారుల వద్దకు వెళ్లి నిలదీశారు. జనాలు నివాసం ఉండే చోట ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు.
Read Also: బోగస్ ఉద్యోగుల ఏరివేతకు సర్కార్ ప్లాన్
Follow Us On: Pinterest

